అసోంలో వరదల కారణంగా 107 మంది మృతి... ఇబ్బంది పడుతున్న 27 లక్షల మంది..!

Suma Kallamadi

ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో కుస్తీ పడుతుంటే అసోం రాష్ట్రం మాత్రం ప్రమాదకరమైన వరదలతో పోటీ పడుతుంది. ఆ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రా నది ప్రవాహం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వేలాది ఇల్లు నీటమునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,700 గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామాల్లోని దాదాపు 50 వేల మంది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించారు అధికారులు. భయంకరమైన వరదల ధాటికి ఇల్లు, వంతెనలు నేలమట్టం అయిపోయాయి. 


ఈ వరదల కారణంగా ఆదివారం నాటికీ మరణాల సంఖ్య 107 కి చేరుకుంది. మరణించిన 107 మందిలో 81 మంది వరదల కారణంగా చనిపోతే... 26 మంది కొండచరియలు విరిగిపడటంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలు వరద ప్రభావిత ప్రాంతాలుగా పరిగణించబడ్డాయి. ఈ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షలమంది నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం లక్ష క్వింటాళ్ల బియ్యం, 20 వేల క్వింటాళ్ల కందిపప్పు తో పాటు 173205 వంట నూనెను సరఫరా చేసింది ప్రభుత్వం. అసోం జలవనరుల మంత్రి కేశబ్ మహంత మాట్లాడుతూ... వరదల ఉధృతిని ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోని అన్ని నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి', అని ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పుకొచ్చారు. 


ప్రధాన నరేంద్ర మోడీ అసోం రాష్ట్రానికి పూర్తి స్థాయిలో సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి తో పాటు వరదల విపత్తును అసోం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి శర్వానంద్ సోనావాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితులపై కొంతసేపు చర్చించారు. అలాగే ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి రాష్ట్రం ఏ చర్యలను చేపడుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. 


ఇకపోతే కొవిడ్-19 వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసి పడేసిన వైద్య వ్యర్ధాలు ప్రస్తుతం వరదల్లో కొట్టుకుపోతూ కరోనా వైరస్ వ్యాప్తిని పెంచుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని మూగజీవులు వరదల ధాటికి మృత్యువాత పడుతున్నాయి. బ్రహ్మపుత్రా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80 శాతం వరకు నీట మునిగింది. దీంతో వన్యప్రాణులు భారీ సంఖ్యలో మరణించాయి. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం మూగ జీవులు జాతీయ రహదారిపైకి తరలి వస్తున్నాయి . ఇప్పటి వరకూ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లో 108 వన్యప్రాణులు మరణించగా వాటిలో 9 ఖడ్గమృగాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: