చైనాకు గట్టి దెబ్బ... భారత్‌ బాటలోనే అమెరికా, ఆస్ట్రేలియా !

NAGARJUNA NAKKA

మొన్న భారత్... నేడో రేపో అమెరికా... ఆ తర్వాత ఆస్ట్రేలియా... ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్‌తో పాటు చైనా యాప్స్‌పై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. డేటా ప్రైవసీ విషయంలో చైనా తయారీ యాప్స్‌ నిబంధనలను ఉల్లఘిస్తున్నాయని... వినియోగదారుల డేటాను చైనాకు కట్టపెడుతున్నాయని ఎప్పటి నుంచో విమర్శలున్నాయి. భారత్ కూడా ఈ కారణం చూపుతూ టిక్‌టాక్‌పై నిషేధం విధించింది. కోట్లాది మంది భారతీయ యూజర్లను కోల్పోవడంతో టిక్‌టాక్ భవిష్యత్తు గందరగోళంలో పడింది. అమెరికా కూడా నిషేధం విధిస్తే ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. యూజర్స్ డేటాను చైనాకు అందిస్తున్నారని ఎప్పటి నుంచే ఆరోపిస్తున్న ఆస్ట్రేలియా కూడా టిక్‌టాక్ యాప్‌ పై చర్యలు తీసుకునేందుకే మొగ్గు చూపుతోంది.

 

ఓ వైపు వరుస నిషేధాలతో ఉక్కిరిబిక్కరవుతున్న టిక్‌టాక్‌కు హాంకాంగ్‌లో జరుగుతున్న పరిణామాలు కూడా ఇబ్బందికరంగా మారాయి. చైనా ఇటీవల ఆమోదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం ప్రకారం...హాంకాంగ్‌లో వ్యాపారం చేసే సంస్థలు కచ్చితంగా యూజర్‌ డేటాను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చైనా నిబంధనల ప్రకారం సెన్సార్‌షిప్ రూల్స్‌కి కూడా అంగీకరించాలి. దీంతో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ హాంకాంగ్‌లో కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది. చైనా యాప్‌ అన్న కారణంగా ఇప్పటికే అనే దేశాలు నిషేధం వైపుగా అడుగులు వేస్తుండటంతో గ్లోబల్ ఆడియన్స్‌ను కోల్పోకుండా ఉండేందుకు టిక్‌టాక్ ప్రయత్నిస్తోంది. చైనా కంపెనీ అయినంత మాత్రాన తమపై చైనా ముద్ర వేయడంపై టిక్‌టాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అందుకే హాంకాంగ్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆదేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తోంది.

 

చైనా యాప్స్ విషయంలో భారత్ బాటలోనే నడవాలని అమెరికా నిర్ణయించుకుంది. టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన యాప్స్‌ను నిషేధించే ఆలోచనలో అమెరికా ఉంది. ఈ ప్రతిపాదనను సీరియస్‌గానే పరిగణిస్తున్నామని ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పోంపియో ప్రకటించారు. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఓ అమెరికన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు మైక్. చైనా కుట్ర వల్లే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాపించిందని ఇప్పటికీ ఆరోపిస్తున్న అమెరికా చైనా విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. చైనా ఏదో ఒక రోజు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. రెండు మూడు రోజుల నుంచి ఆయన వరుసగా చైనాకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. చైనా పేరు ఎత్తితేనే తనకు కోసం వస్తుందన్నారు. 

 

అమెరికా కూడా నిషేధం విధిస్తే... టిక్‌టాక్‌తో పాటు చైనాకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. దాదాపు మూడున్నర కోట్ల మంది అమెరికన్లు టిక్‌టాక్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. చైనాపై కోపంతో ఉన్న అమెరికన్లు టిక్‌టాక్ సహా చైనా యాప్స్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భారత్‌ నిషేధం విధించిన తర్వాత ఆ డిమాండ్ మరింత పెరిగింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికాలో సెంటిమెంట్‌ కూడా బలపడుతోంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు టిక్‌టాక్ వంటి చైనా యాప్స్ వాడకుండా నిషేధం విధించే బిల్లులు కూడా ప్రస్తుతం యూఎస్ కాంగ్రెస్ ముందు పెండింగ్‌లో ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండటంతో చైనాకు వ్యతిరేకంగా ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా టిక్‌టాక్ సహా ఇతర చైనా యాప్స్‌పై బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: