భారత్ చైనా వివాదం : సరిహద్దుల్లో డ్రాగన్ బుసలు...యుద్ధంపై లఢక్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..?
భారత్ చైనా వివాదం విషయంలో చైనా ద్వంద్వ నీతిని బట్టబయలు చేసింది. ద్వైపాక్షిక చర్చల్లో సైనిక ప్రతిష్టంభనను శాంతియుతంగా పరిష్కరించుకుందామని చెప్పిన చైనా రెండు రోజులైనా గడవక ముందే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారీస్థాయిలో సరిహద్దులో యుద్ధవిన్యాసాలకు దిగుతున్నట్టు ప్రకటన చేసింది. వేలమంది పారాట్రూపర్లు, యుద్ధ ట్యాంకులను చైనా ఏర్పాటు చేసుకుంది.
చైనా అధికారిక మీడియా భారత్ కు గట్టి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంలో చైనా ఉన్నట్టు ప్రకటన చేసింది. దాదాపు నెలరోజులుగా తూర్పు లడఖ్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుదేశాలు పెద్దఎత్తున సైనిక మోహరింపులు చేపట్టాయి. శనివారం ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య చర్చ జరిగినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంతా భావించారు.
ఇలాంటి సమయంలో చైనా యుద్ధ సైనికుల విన్యాసాలను గ్లోబల్ టైమ్స్ ప్రకటించింది. భారీగా బలగాలను మధ్య ఫ్రావిన్స్ నుంచి సరిహద్దుల్లోకి పంపినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. భారత్ లో సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలోనే వీటిని చేపట్టినట్టు కీలక ప్రకటన చేసింది. పౌర విమానాలు, రైళ్ల ద్వారా విడతల వారీగా తరలించినట్లు సమాచారం. గ్లోబల టైమ్స్ చైనా గత వారం కూడా ఇదే తరహా విన్యాసాలు చేపట్టినట్టు ప్రకటన చేసింది.
చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ లఢక్ ఎంపీ సెరింగ్ నెంగ్యాల్ వివాదాస్పద ప్రాంతాలను సందర్శించారు. చైనా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించిన విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా యుద్ధానికి దిగే సాహసం చేయకపోవచ్చని వ్యాఖ్యలు చేశారు. తన పర్యటన వల్ల ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడంతో పాటు భూభాగాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేమనే సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుందని చెప్పారు.