ఎబోలా వైరస్ కలకలం : విజృంభిస్తున్న ఎబోలా వైరస్.... వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే...?
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఒకవైపు కరోనా ధాటికి ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కాంగో తమ దేశంలో ఎబోలా వైరస్ కొత్తగా వ్యాపిస్తున్నట్టు ప్రకటన చేసింది. కాంగోలోని వంగటాలో ఆరు ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు మృత్యువాత పడ్డారు.
అయితే మరికొన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. పపంచ ఆరోగ్య సంస్థ నమోదైన ఆరు కేసుల్లో మూడు కేసులను ల్యాబ్ పరీక్షల్లో ధృవీకరించినట్టు తెలిపింది. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందడం 11వ సారి. 1976లో కాంగోలో ఎబోలా వైరస్ తొలిసారి వెలుగు చూసింది. ఈ వైరస్ ప్రాణాంతక వైరస్. ఈ వైరస్ భారీన పడిన వారు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎబోలాలో మొత్తం ఐదు వైరస్ జాతులు ఉండగా అందులో నాలుగు జాతులు మనుషులకు ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు తేల్చారు. ఎబోలా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే కాలేయం, రోగనిరోధక శక్తి కణాలపై దాడి చేస్తాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరిచి ప్రతి అవయవాన్ని దెబ్బ తీస్తుంది. ఈ వైరస్ కోతులు, గబ్బిలాల నుంచి వ్యాప్తి చెంది ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
ఒకరి శరీరాన్ని మరొకరు తాకడం ద్వారా, పురుషుల శుక్ర కణాల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎబోలా వైరస్ భారీన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, పొత్తికడుపు నొప్పి, గొంతులో నొప్పి, బలహీనత, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన వారిలో కళ్లు, ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం కావడం, చర్మంపై దద్దుర్లు, రక్త విరోచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.