రైలు ప్రయాణికులకు శుభవార్త... తత్కాల్ టికెట్లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్...?

Reddy P Rajasekhar

దాదాపు రెండు నెలల తరువాత రైళ్లు మళ్లీ ప్రారంభం అయ్యాయి. దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ ప్రయణికుల రాకపోకలతో సందడిగా మారాయి. రైల్వే శాఖ కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే రైళ్లలోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రాల నుంచి వచ్చేవారిని క్వారంటైన్ కు తరలించేలా ఏర్పాట్లు చేసింది. నిన్న ఉదయం 7 గంటల నుంచే భారీ సంఖ్యలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. 
 
రైల్వే శాఖ రైలు బయలుదేరే 90 నిమిషాల ముందే ప్రయాణికులు రైల్వే స్టేషన్ కు చేరుకోవాలనే నిబంధన విధించడంతో ప్రయాణికులు నిబంధనల మేరకు ముందుగానే రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా నేలపై గుర్తులు వేయడంతో పాటు... థర్మల్ స్క్రీనింగ్ లో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించని వారిని మాత్రమే అధికారులు అనుమతించారు. ప్రయాణికులు ప్రయాణం పూర్తయ్యే వరకు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. 
 
రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి తత్కాల్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు ప్రకటన చేసింది. తెలంగాణలోని నాంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నిన్న 9 రైళ్లు బయలుదేరాయి. హై రిస్క్ ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు వారం రోజుల పాటు క్వారంటైన్ లో... మరో వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. అధికారులు ముంబై, చెన్నై, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను హై రిస్క్ రాష్ట్రాలుగా గుర్తించారు. 
 
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఐ.సీ.ఎం,ఆర్ ల్యాబ్ నుంచి కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తెచ్చుకుంటే వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది. నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభమైన 200 రైళ్లలో 22 రైళ్లు ఏపీ మీదుగా వెళుతున్నాయి. ఏపీ రాష్ట్రంలోని 18 రైల్వే స్టేషన్లలో దిగే ప్రయాణికులలో 5 శాతం మందికి స్వాబ్ పరీక్షలు నిర్వహించనుంది. పదేళ్ల లోపు ఉన్నవారు, గర్భిణులకు 14 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: