అతి తీవ్ర తుఫాన్ గా అంఫన్... ఏపీకి భారీ వర్షాలు...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంఫన్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్రంలో రాబోయే 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటన చేసింది. నిన్న అంఫన్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. వాతావరణ శాఖ అంఫన్ తుఫాన్ బంగాళాఖతంలో ఈశాన్యం వైపు పయనించి 20వ తేదీన పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ ల మద్య తీరాన్ని తాకనుందని తెలిపింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉందని ప్రకటన చేసింది.
గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తుఫాన్ ఉత్తర–ఈశాన్యం వైపు పయనించి దిఘా, ఘాటియా దీవుల మధ్య పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు తుఫాను ఉత్తర కోస్తా తీరాన్ని తాకనుండటంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒడిశా తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ నిపుణులు తుఫాను తీరం దాటే సమయంలో 265 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతోంది.
ఒడిశా సర్కార్ ముందస్తు చర్యల్లో భాగంగా 12 జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోదీ అంఫన్ తుఫాన్ గురించి ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.