జులై నాటికి భారత్ లో కరోనా విశ్వరూపం... ఎయిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు...?
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 53,045 కరోనా కేసులు నమోదయ్యాయి. 15,331 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 1,787 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రముఖ సంస్థలు చేసిన సర్వేల్లో మే 31 నాటికి కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తేలింది.
అయితే తాజాగా ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కరోనా వైరస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. జూన్ - జులై నాటికి దేశంలో కరోనా వైరస్ పీక్ స్టేజికి వెళ్లే అవకాశం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయని... ఇప్పటివరకు నమోదైన కేసుల ప్రకారం చూస్తే జూన్ - జులై నెలల్లో కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటైన్మెంట్, రెడ్ జోన్లలో కొత్త కేసులు నమోదు కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో కరోనా ఎప్పుడు తీవ్రరూపం దాల్చుతుందో ఖచ్చితంగా చెప్పలేమని... కరోనా కేసుల పెరుగుదల రేటు నిలకడగా ఉందని అన్నారు. మరోవైపు కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకు లాక్ డౌన్, భౌతిక దూరం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేయగలమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
ఏపీలో నిన్న 56 కొత్త కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1833కు చేరింది. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 38కు చేరగా 780 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో తక్కువ కేసులే నమోదవుతున్నప్పటికీ కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి రావడం లేదు. రాష్ట్రంలో నిన్న 15 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరింది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 16,758 కేసులు నమోదయ్యాయి.