తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా... కానీ...?

Reddy P Rajasekhar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణాలో పరిస్థితి అదుపులోనే ఉంది. రాష్ట్రంలో నిన్న 21 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో 20 కరోనా కేసులు నమోదు కాగా జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా హైదరాబాద్ నగరంలో కరోనా విజృంభణ తగ్గకపోవడం గమనార్హం. 
 
రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ నగరంలోనే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా భాగ్య నగరంలో వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో కరోనా తగ్గుముఖం పడితే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కరోనా అదుపులోకి వచ్చినట్టేనని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
 
లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడం... అదే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రేషన్ పంపిణీతో పాటు 1500 రూపాయల నగదు జమ చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి కరోనా కేసులు పెరిగిన సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి ప్రజల్లో ధైర్యం నింపడాన్ని కూడా ప్రజలు ప్రశంసిస్తున్నారు. 
 
సీఎం కేసీఆర్, అధికార యంత్రాంగం కృషి ఫలితం వల్లే గత ఐదు రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని... మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉండకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణలోని వనపర్తి, యాదాద్రి, వరంగల్ రూరల్ జిల్లాలలో ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలోని 17 జిల్లాలలో గత 14 రోజుల నుంచి కొత్త కేసులు నమోదు కాలేదు. తెలంగాణ కరోనా కట్టడి చేయడంలో సక్సెస్ అవుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: