టీడీపీ వర్సెస్ వైసీపీ: న్యాయంలో తేడా...మధ్యలో బుద్దా ట్విస్ట్!

M N Amaleswara rao

ఏపీలో కరోనాపై అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజకీయ వార్ జరుగుతూనే ఉంది. ఓ వైపు కరోనా కట్టడి చేయడంలో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగానే, మరోవైపు ప్రజలకు సాయం చేసే సమయంలో భౌతిక దూరం పాటించడంపై కూడా రచ్చ జరుగుతుంది. అసలు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, గుంపులుగా చేరి కరోనా వ్యాప్తికి కృషి చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

 

అలాగే భౌతిక దూరం పాటించకుండా, హడావిడి కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. అలా లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వైసీపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని టీడీపీ నేతలు పోలీసులని ప్రశ్నిస్తున్నారు. అటు వైసీపీ నేతలు కూడా రివర్స్ లో టీడీపీపై విమర్శలు చేస్తుంది. చంద్రబాబు పుట్టినరోజు నాడు కొందరు టీడీపీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించారని ఆరోపించారు.

 

ఈ క్రమంలోనే విజయవాడలో పేదలకు సాయం చేస్తున్న ఎంపీ కేశినేని నాని భౌతిక దూరం పాటించలేదని పోలీసులు కేసు నమోదు చేసారు. దీంతో పలువురు టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిపోతున్నారు. తాజాగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుపతి పర్యటనకు వెళ్లడాన్ని ఉదాహరణగా చూపించి మండిపడుతున్నారు. తాత్కాలికంగా మూసేసిన శ్రీవారి ఆలయంలోకి సుబ్బారెడ్డి ఎలా వెళ్తారని, హైదరాబాద్ లో ఉన్నా సుబ్బారెడ్డి తర్వాత తిరుపతి, ప్రకాశం, తాడేపల్లి ఎలా వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.

 

వైసీపీ నేతలకు లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా? అని నిలదీస్తున్నారు. సాయం చేసే టీడీపీ నేతలపై కేసు నమోదు చేయడం అన్యాయం అంటున్నారు. వైసీపీ నేతలకు ఓ రూల్‌.. ప్రతిపక్షాలకు మరో రూలా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పేదలకు సాయం చేస్తున్న తనపై  దొంగ కేసులు బనాయించిన విజయవాడ పోలీసులకు ధన్యవాదాలు టీడీపీ ఎంపీ కేశినేని నాని చురకలేస్తే, అదే విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాత్రం కరోనా కొంతైనా అదుపులో ఉందంటే పోలీసులవల్లేనని పొగుడుతూ ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఒకే పార్టీలో ఉన్న కేశినేని నాని, బుద్దాలకు పెద్దగా పడదన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: