కృష్ణా జిల్లా వాసులకు షాకింగ్ న్యూస్.... ఆ మార్కెట్లో కూరగాయల వల్ల కరోనా వ్యాప్తి...?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజూ 50కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు రాష్ట్రంలో 81 కరోనా కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలోనే 52 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో కృష్ణా జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణాలు ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జిల్లాలో భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడనికి రాజీవ్ గాంధీ హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కారణమని తెలుస్తోంది. బస్టాండ్ కు అతి సమీపంలో ఉండే ఈ మార్కెట్లో లాక్ డౌన్ వల్ల మార్కెట్ కు వచ్చే వారి సంఖ్య తగ్గింది. అయితే మార్కెట్ లోని హమాలీలు అధికారుల అనుమతితో కూరగాయలను ఇంటింటికీ పంచుతున్నారు. అయితే తాజాగా ఈ హమాలీలంతా కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు.
ఈరోజు 52 కేసులు నమోదు కాగా ఈ కేసులకు, రాజీవ్ గాంధీ మార్కెట్ కు లింక్ ఉన్నట్టు తేలింది. హమాలీలలో కరోనా లక్షణాలు కనిపించటంతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో నమోదైన కేసుల్లో కేవలం మూడు ఏరియాల నుంచే 60 కేసులు నమోదు కావడం గమనార్హం.
విజయవాడలోని కార్మిక నగర్, ఖుద్ధూస్ నగర్, కృష్ణ లంక నుంచే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజా పరిణామాల నేపథ్యంలో నగరంలో కూరగాయలు ఉచితంగా ఇచ్చినా తీసుకునేవారే కరువయ్యారు. మరోవైపు రాష్ట్రంలో ఈరోజు 81 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 1097కు చేరింది. రాష్ట్రంలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతోంది.