ప్రధాని ప్రసంగంపై ప్రజలు ఏమంటున్నారంటే...?

Reddy P Rajasekhar

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరూ ఊహించిన విధంగానే లాక్ డౌన్ మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ 20 నుంచి అత్యవసర విషయాలకు మినహాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. మొదట ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు. లాక్ డౌన్ అమలులో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని చెప్పారు. కరోనా పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 
 
లాక్ డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రకటన చేశారు. దేశ ప్రజలంతా సైనికుల వలే కరోనా కట్టడి కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రజల సహకారంతోనే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని తెలిపారు. తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కరోనా మహమ్మారి పంజా విసురుతోందని పేర్కొన్నారు. కరోనాపై భారత యుద్ధం బలంగా సాగుతుందని తెలిపారు. ప్రజలు కష్టమైనా, నష్టమైనా దేశం కోసం నిలబడ్డారని అన్నారు. 
 
ప్రధాని ప్రసంగంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ ను పొడిగించడం పట్ల ప్రజలు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయకపోయినప్పటికీ అత్యవసర ప్రయాణాల విషయంలో మోదీ నుంచి కీలక ప్రకటన వెలువడుతుందని ఆశించామని చెబుతున్నారు. ఈరోజుతో లాక్ డౌన్ గడువు ముగుస్తుందని భావించి కొందరు విమానాల్లో టికెట్లు బుకింగ్ చేసుకోగా టికెట్లు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మొదట ఇచ్చిన అనుమతులు వెనక్కు తీసుకుంటున్నామని మోదీ చేసిన ప్రకటన వల్ల ప్రజలు అత్యవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అకస్మాత్తుగా మోదీ లాక్ డౌన్ ప్రకటించడంతో చాలా మంది గత 21 రోజులుగా ఇతర రాష్ట్రాల్లో ఇబ్బందులు పడుతూ జీవనం సాగిస్తున్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 20 రోజులుగా ఇంటికే పరిమితం కావడంతో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, వైద్యం, ఇతర విషయాల్లో సహాయసహకారాలు అందించాలని కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: