తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.... వెయ్యి దాటిన పాజిటివ్ కేసులు...!
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. తెలంగాణలో 563 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 1002 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో హైదరాబాద్ నగరంలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో గుంటూరు, కర్నూలు జిల్లాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇరు రాష్ట్రాల్లో ప్రతిరోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొద్దిసేపటి క్రితం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఈరోజు ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో 12 కేసులు నమోదు కాగా సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ లో 7 కొత్త కేసులు నమోదయ్యయి. ఏపీలో ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు జరిగిన కరోనా పరీక్షల్లో గుంటూరులో 3, నెల్లూరులో 4 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 7 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 439 కి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది.
తెలంగాణలో ఈరోజు 32 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈరోజు తెలంగాణలో ఒకరు మృతి చెందినటు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 17కు చేరింది. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా 246 కంటైన్మెంట్ ఏరియాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఉచితంగా మాస్కులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది.
మరోవైపు దేశ ప్రజలంతా ప్రధాని మోదీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి ప్రకటన చేస్తారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోదీ ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను పొడిగించనున్నారని సమాచారం అందుతోంది. కేంద్రం దేశవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా, తక్కువ కేసులు నమోదైన ప్రాంతాలను ఆరెంజ్ జోన్లుగా, కేసులు నమోదు కాని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించనుందని తెలుస్తోంది.