కఠిన చర్యలు తీసుకున్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారే.. !
కరోనా..! ఈ పేరు వింటనే ప్రపంచదేశాలన్నీ హడలిపోతున్నాయ్. భారత్‌లో కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. అయితే అధికారులు కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ప్రజలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం పటిష్టంగా అమలవుతోంది.
దేశమంతటా లాక్‌డౌన్ అమలు చేస్తున్నా... కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అయితే, ప్రస్తుతం వేలకు పరిమితమైన కేసులు... లాక్‌డౌన్ విధించకపోతే లక్షలు దాటేవన్నది కేంద్ర ప్రభుత్వ అంచనా. దీంతో రాష్ట్రాలన్నీ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాయ్. అయితే, కొన్ని చోట్ల ప్రజలు నిర్లక్యంగా వ్యవహరిస్తూ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వేగంగా విస్తోరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఆయా ప్రాంతాలను అష్టదిగ్భంధం చేసింది. గడప దాటి ఎవరూ బయటికి రావడానికి వీలు లేదంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యావసరాలు కూడా ఇంటికే సరఫరా చేసేలా కేజ్రీవాల్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. నిబంధనలు పాటించని వారిని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది.
అటు అత్యధిక కేసులన్నా మహారాష్ట్రలోనూ లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. పోలీసులు ఎక్కడిక్కడా బారికేడ్లతో రహదారుల్ని మూసివేశారు. మధ్యప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. అయితే, బీహార్ రాజధాని పాట్నాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పాట్నాలో కూరగాయలు కొనేందుకు జనాలు గుంపులు గుంపులుగా బయటకు వచ్చారు. సామాజిక దూరం పాటించకుండా మార్కెట్‌లో జనాలు పోగయ్యారు.
మరోవైపు లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం అధికారికంగా ప్రకటక చేయకపోయినా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పాటించాలని నాలుగు రాష్ట్రాలు నిర్ణయించాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా ఈ నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. మహారాష్ట్ర తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఒడిశాలో ప్రభావం అంతగా లేకపోయినా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పొడిగింపుపై కేంద్రం ఇవాళో, రేపో ప్రకటన చేసే అవకాశముంది.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్నారు. పాటియాలాలో మాత్రం నిబంధనలు ఉల్లంఘించిన వారిని అడ్డుకున్నందుకు ఓ పోలీసు అధికారి చెయ్యి నరికారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దేశంలో కరోనా వ్యాప్తి మూడో దశకు చేరుకోవడంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వీధుల్లో తిరుగుతూ స్థానికులకు పలు సూచనలు చేశారు అధికారులు.