శ్వాసకోస వ్యాధిగ్రస్తులకు మరింత ప్రమాదం !
భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఇండియన్ కౌన్సెల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ - ICMR కీలక అంశాలు వెల్లడించింది. సామాజిక వ్యాప్తి చెందే అవకాశం కనిపిస్తోందని హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కొన్నివారాలుగా అధ్యయనం చేస్తున్న ICMR ఈ అంచనాకు వచ్చింది. ఒకవేళ సామాజిక వ్యాప్తి ప్రారంభమైతే కరోనా ఇంపాక్ట్ దేశంపై గణనీయంగా ఉంటుంది.
భారత్‌లో సామాజిక వ్యాప్తి ద్వారా కరోనా వైరస్ సోకే ప్రమాదం కనిపిస్తోందని ICMR హెచ్చరించింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో ICMR అధ్యయనం చేస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా 5వేల 911మంది శ్వాసకోస సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారిపై ఆ సంస్థ కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో 20 రాష్ట్రాల్లోని 52 జిల్లాల్లో 104 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే ఇందులో 39.2 శాతం మందికి ఎలాంటి విదేశీ పర్యటనలతో కానీ, విదేశాల నుంచి వచ్చిన వాళ్లతో కానీ సంబంధం లేదు. దీన్ని బట్టి సామాజిక వ్యాప్తికి అవకాశం ఉందని ICMR అభిప్రాయపడింది.
15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో ఫారిన్ హిస్టరీతోకానీ, విదేశాల నుంచి వచ్చిన వాళ్లతో కానీ సంబంధం లేని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుజరాత్‌లో 792 మందికి కరోనా పరీక్షలు చేస్తే అందులో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. తమిళనాడులో 577 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మహారాష్ట్రలో 553 మందికి కరోనా పరీక్షలు చేస్తే 21 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కేరళలో 502 మందికి చేయగా ఒక్కటి మాత్రమే పాజిటివ్‌గా తేలింది.
మార్చి 14వ తేదీ తర్వాత శ్వాసకోస సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 నుంచి 21వతేదీ మధ్య 106 మంది పాజిటివ్ రిపోర్టులు వచ్చిన వారిని పరీక్షించగా అందులో ఇద్దరు శ్వాసకోస సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించింది. మార్చి 22 నుంచి 28 మధ్య 2877 మందికి ICMR పరీక్షలు నిర్వహించింది. వారిలో 48 మందికి కరోనా సోకినట్లు తేలింది.
IMCR తన అధ్యయన నివేదికలో మరో కీలక అంశాన్ని కూడా వెల్లడించింది. వ్యాధి సోకుతున్నవారిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారని తెలిపింది. అందులో కూడా 50 ఏళ్లు పైబడిన వారికి వ్యాధి ఎక్కువగా సోకుతోందని ప్రకటించింది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 2 మధ్య కరోనా వైరస్ సోకిన వారిలో శ్యాసకోస సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడే వారి సంఖ్య 2.6 శాతం పెరిగింది. దీన్ని బట్టి రెస్పిరేటసీ సమస్యలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని ICMR హెచ్చరించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శ్వాస కోస సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ICMR సూచించింది. వీరు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలని కోరింది.