నన్ను ఇంటికి వెళ్లనివ్వండి ప్లీజ్... లాక్ డౌన్ తో బస్ స్టేషన్ వద్ద వెక్కివెక్కి ఏడ్చిన బాలుడు...!

Reddy P Rajasekhar

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 566కు చేరింది. వీరిలో చికిత్స పొందుతూ 11 మంది మృతి చెందారు. 40 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో 39 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో బాధితుల సంఖ్య 8కు చేరింది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. కరోనా కారణంగా ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రజా రవాణా నిలిపివేసిన విషయం తెలిసిందే. 
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకస్మాత్తుగా ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేయడంతో వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. సొంతూళ్లకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నా అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో అధిక సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీహార్ కు చెందిన ఒక బాలుడు ఢిల్లీలోని అంతర్రాష్ట్ర టెర్మినల్ దగ్గర వెక్కివెక్కి ఏడుస్తూ మీడియా కంటపడ్డాడు. 
 
మూడు రోజుల నుంచి ఆ బాలుడు సొంతూరికి వెళ్లాలని బస్ టెర్మినల్ దగ్గర నిరీక్షిస్తున్నాడు. మీడియా బాలుడిని పలకరించడంతో తాను ఇంటికి వెళ్తానంటూ బాలుడు వెక్కివెక్కి ఏడ్చాడు. తనను పోలీసులు వెంటపడి తరుముతున్నారని... తాను తప్పనిసరిగా సొంతూరికి వెళ్లాలని చెప్పాడు. కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల్లో ఈ బాలుడు కూడా ఒకడు. 
 
ఢిల్లీలో సొంత ఇల్లు లేకపోవడం... పని లేకపోవడంతో సొంతూరికి వెళ్లి కుటుంబీకులను కలుసుకోవాలని ఉందని  బాలుడు మీడియాకు చెప్పాడు. సోషల్ మీడియాలో బాలుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అతడి వంటి అనేక మందికి ఆహారం, వసతి కల్పించాలని కోరారు. ఢిల్లీలో బీహార్, గోవా, కేరళ, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు చిక్కుకుపోయారు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: