వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు సీఎం జగన్ బంపర్ ఆఫర్...?
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోం ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం జగన్ సూచనల మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఇంటి నుంచి పని చేసే వారికి ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు, టెలీకాం కంపెనీలకు ఉద్యోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇంటర్నెట్ అందించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోనశశిధర్ తో గౌతం రెడ్డి ఇంటర్నెట్ సదుపాయం గురించి చర్చలు జరిపారు. ఏపీలో కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటి నుండి పని చేసే ఉద్యోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు మరిన్ని కఠిన నిర్ణయాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఈరోజు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ధ్రువీకరించింది. లండన్ నుంచి ఈ నెల 18న రాజమండ్రికి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ నెల 17న పారిస్ నుంచి ఢిల్లీకి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. విశాఖ, నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, విజయవాడలలో ఒక్కో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరోనా కట్టడి ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పలు నిర్ణయాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 13 జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి విషయంలో ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా నివారణ కోసం అధికారులతో పాటు ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, గ్రమా, వార్డ్ వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటోంది,