ఆటల కోసం ప్రాణాలు పణంగా పెట్టేదిలేదు..!
ఒలింపిక్స్ నిర్ణీత షెడ్యూల్ మేరకు జరుగుతాయని జపాన్ ప్రధాని షింజో అబె, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చీఫ్ థామస్ పదేపదే నొక్కిచెబుతున్నా.. జపాన్‌లో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్‌లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఆ క్రీడలకోసం తమ ప్రాణాలు పణంగా పెట్టబోమని దేశ ప్రజలు అంటున్నారు.
ప్రస్తుతం కరోనా వైరస్ గురించి ప్రపంచమంతా ఎంత చర్చ జరుగుతోందో అంతకుమించి ఒలింపిక్స్‌పై వాదోపవాదాలు జరుగుతున్నాయి. కరోనా దెబ్బకు ప్రఖ్యాత ఫుట్‌బాల్ లీగ్‌లు, ఎన్‌బీఏ చాంపియన్‌షిప్ రద్దయ్యాయి. జపాన్‌లోనూ పలు క్రీడా పోటీలది అదే దుస్థితి. దీంతో.. ఒలింపిక్స్‌ను కనీసం ఏడాది వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే సూచించారు. ఇక.. జపాన్‌లో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. 814 పాజిటివ్ కేసులే నమోదుకాగా, 24 మంది మరణించారు. కానీ ఆ దేశ ప్రజలు ఒలింపిక్స్ నిర్వహించవద్దని ఖరాఖండిగా చెబుతున్నారు.
మెజార్టీ జపాన్ ప్రజలంతా ఒలింపిక్స్ అతిథ్యంపై వ్యతిరేకత కనబరుస్తున్నారు. జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్ నిర్వహణపై జపాన్‌కు చెందిన మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే ప్రజాభిప్రాయం సేకరించింది. అందులో 45 శాతం మంది నిర్ణీత సమయానికి ఒలింపిక్స్ నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. 40 శాతంమంది సుముఖత ప్రకటించారు. ఇక.. క్యోడో అనే సంస్థ వేయిమందితో చేసిన ప్రజాభిప్రాయ సేకరణలో 69.9 శాతం మంది ఒలింపిక్స్ నిర్వహించవద్దని సూచించారు. 'ఒలింపిక్స్‌ను రద్దు చేయడాన్ని ఊహించలేమంటున్నారు టోక్యో గవర్నర్.
మరోవైపు.. జపాన్ ఒలింపిక్స్ కమిటీ ఉపాధ్యక్షుడు, జపాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు కోజో తాషిమాకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు మంగళవారం నిర్వహించిన పరీక్షల నివేదికలో 62ఏళ్ల వయసున్న ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ నిర్వహణపై అనుమానాలు మరింత పెరిగాయి. ఫిబ్రవరి 28న నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని బెల్‌ఫాస్ట్‌లో అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోషియేషన్ బోర్డు సమావేశం, మార్చి 3న నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన యురోసియన్ సాకర్ సమాఖ్య వార్షిక సమావేశంలో పాల్గొన్నట్టు ఆయన తెలపడంతో.. ఆయా సమావేశంలో పాల్గొన్న వారికి వైరస్ సోకిందా అనే అనుమానం కలుగుతోంది.
కాగా, షెడ్యూల్ ప్రకారం జపాన్‌లోని టోక్యో నగరంలో జులై 24న ఒలింపిక్స్, ఆగస్టు 25న పారాలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో దాదాపు 11 వేల మంది అథ్లెట్లు పాల్గొనే అవకాశముంది.