కరోనా జన్మస్థానం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..!
కరోనా జన్మస్థానం చైనా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. రెండు నెలలుగా జనజీవనం స్తంభించగా.. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దక్షిణ ప్రావిన్సుల్లో స్కూళ్లు కూడా ప్రారంభమయ్యాయి. అయితే స్కూళ్లు మొదలైతే కరోనా మళ్లీ విస్తరిస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.
కరోనా దెబ్బకు ప్రపంచ ఫ్యాక్టరీగా పేరున్న చైనా మూతబడింది. జనవరి ఆఖరు వారం నుంచే స్కూళ్లకు చైనీస్ న్యూ ఇయర్ హాలిడేస్ ఇచ్చారు. కార్యాలయాలు, పరిశ్రమలు అన్నీ మూతబడ్డాయి. కరోనా పుట్టిన వుహాన్ నగరాన్ని మిగతా దేశం నుంచి వేరు చేసి మరీ దిగ్బంధించారు. ఇంత చేసినా మొన్నటి వరకు డ్రాగన్ దేశంలో మరణ మృదంగం మోగుతూనే ఉంది. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి కొలిక్కి వస్తోంది. మొత్తం కేసుల సంఖ్య చూసుకుంటే ఇప్పటికీ ప్రపంచంలోనే చైనానే మొదటి స్థానంలో ఉన్నా.. అక్కడ రోజురోజుకూ నమోదవుతున్న కేసుల సంఖ్య బాగా తగ్గింది.
గత 24 గంటల్లో చైనాలో కేవలం 16 కరోనా కేసులే నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే నాలుగు కేసులు తక్కువ. వుహాన్ నగరం ఉన్న హుబెయ్ ప్రావిన్స్ ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటోంది. దక్షిణ చైనా ప్రావిన్సుల్లో స్కూళ్లు కూడా మొదలయ్యాయి. తగిన జాగ్రత్తలు తీసుకునే పాఠశాలలు తెరవాలని ఆదేశాలు ఇచ్చినట్టు చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనాలో కొన్ని ప్రావిన్సులతో పాటు తైవాన్ లో కూడా స్కూళ్లు తెరిచారు. మాస్కులు వేసుకున్న విద్యార్థులు.. క్యూలో నిలబడి స్కూల్ గేట్ల దగ్గర స్క్రీనింగ్ చేయించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కరోనా ప్రబలిన దగ్గర్నుంచీ చైనాలో మాస్ కాంటాక్ట్ లేకుండా జాగ్రత్తపడ్డారు. సగానికి పైగా చైనా జనాభాను దిగ్బంధించారు. వుహాన్ అయితే ఐసోలేటెడ్ సిటీగా వార్తల్లోకి ఎక్కింది. చైనా వేగవంతమైన, కఠిన నియంత్రణ చర్యలు తీసుకోవడంతో.. కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ కరోనా ఇంకా పూర్తిగా తగ్గకుండానే స్కూళ్లు తెరిస్తే.. మళ్లీ మాస్ కాంటాక్ట్ ముప్పు ఉందనే భయాలు నెలకొన్నాయి. అయితే స్కూలు విద్యార్థుల్లో కరోనా వ్యాప్తి రేటు చాలా తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా నిపుణుల సంయుక్త బృందం ప్రకటించింది. 18 ఏళ్లలోపు వారిలో కరోనా విస్తరణ చాలా తక్కువగా ఉంటుందని, వీరికి ఒకవేళ కరోనా సోకినా.. 0.2 కేసుల్లో మాత్రమే ప్రమాదం పొంచి ఉంటుందని గణంకాలు చెబుతున్నాయి.
చైనాలో స్కూళ్లతో పాటు యాపిల్ స్టోర్లు కూడా తెరుచుకుంటున్నాయి. త్వరలోనే జనజీవనం సాధారణ స్థితికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే మళ్లీ కరోనా విస్తరించకుండానే ఉంటేనే ఇది సాధ్యపడుతుందని నిపుణులు చెబుతున్నారు.