కడప రాజంపేటలో మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్... ఎందుకంటే...?
కడప జిల్లాలోని రాజంపేట మున్సిపాలిటీకి ఈ సంవత్సరం కూడా ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వైసీపీ బలంగా ఉన్న ఈ మున్సిపాలిటీలో గతంలో హైకోర్టులో టీడీపీ వేసిన పిటిషన్ కారణంగా ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక్కడి మున్సిపల్ చైర్మన్ పదవిని ప్రభుత్వం అన్ రిజర్వుడ్ కు కేటాయించింది. కానీ కొన్ని కారణాల వల్ల రాజంపేట మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించడం లేదని నిన్న ఎన్నికల కమిషన్ ప్రకటన చేసింది.
గత పది సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ దిక్కయ్యారు. ఈ మున్సిపాలిటీకి గత పదేళ్లుగా పాలక వర్గం లేదు. 2009లో దివంగత నేత వైయస్సార్ మరణం తర్వాత రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులెవ్వరూ రాజంపేటకు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే సాహసం చేయలేకపోయారు. రాజంపేట మున్సిపాలిటీ పరిధికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను రాజంపేటలో కలపాలని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో నిర్ణయం తీసుకున్నారు.
కొందరు గ్రామాల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కారు. హైకోర్టు కేసులో తీర్పు వచ్చేంతవరకు ఎన్నికలు జరగకుండా స్టే ఇచ్చింది. అప్పటినుండి రాజంపేట మున్సిపల్ ఎన్నికలకు దూరమైంది. రాజంపేటకు 2005లో చివరిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజంపేట అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ఆ అభివృద్ధి నేటికీ పట్టణవాసులకు కనిపిస్తోంది.
రాజంపేటలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు చేసినవారు తెలుగుదేశం పార్టీ నేతలు కావడం గమనార్హం. ఈ మున్సిపాలిటీలో టీడీపీకి పెద్దగా బలం లేకపోవడం వల్లే తెలుగు తమ్ముళ్లు పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపణలు వినిపించాయి. కోర్టు స్టే వల్ల మళ్లీ రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈసారైనా మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని భావించామని మరోసారి తమకు నిరాశే ఎదురైందని రాజంపేట ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.