కన్నుమూసిన పాత్రికేయ దిగ్గజం

తెలుగు పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా విశేష సేవలు అందించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ( 86 ) కన్నుమూశారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కొంతకాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన సొంత ఇంట్లోనే కన్ను మూశారు.1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో పొత్తూరి వెంకటేశ్వరావు జన్మించారు. 1957 ఆంధ్ర పత్రికలో పాత్రికేయ వృత్తి ప్రారంభించారు. తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ ఇలా అనేక పత్రికల్లో పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన అనేక పుస్తకాలు రాశారు. 


2000 సంవత్సరంలో ఆయన రాసిన నాటి పత్రికలు మేటి విలువలు పుస్తకం 2001లో విడుదలైన చింతన చిరస్మరణీయులు పుస్తకాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చాయి. తెలుగు భాష వికాసానికి పొత్తూరు వెంకటేశ్వరరావు ఎంతో కృషి చేశారు. ఎందరో సాహిత్య కారులకు బాసటగా పొత్తూరి వెంకటేశ్వరరావు నిలవడమే కాకుండా తెలుగు భాషాభివృద్ధికి కారకులయ్యారు. దాదాపు 150 ఏళ్ల తెలుగు పత్రికా రంగం చరిత్రలో పొత్తూరి వెంకటేశ్వరరావు మైలురాయిగా నిలిచిపోతారు. సాహిత్య ప్రియులందరికీ ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. అలాగే సాహిత్య సభల్లో తరచుగా ఆయన పాల్గొంటూ అనేక పుస్తకాలకు ముందుమాట రాశారు.


 చక్కగా చదవడం, రాయడం మాత్రమే కాదు, మాట్లాడటం కూడా అవసరమని పొత్తూరి పదేపదే చెబుతూ ఉండేవారు. పొత్తూరు వెంకటేశ్వరరావు మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ తదితరులు పొత్తూరి మరణంపై తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో మంది జర్నలిస్టులకు పొత్తూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.పొత్తూరి వెనకటేశ్వరావు మరణం సాహిత్య ప్రియులకు తీరని లోటనే చెప్పాలి.పంచె కట్టుతో అచ్చ తెలుగు పెద్ద మనిషిగా ఉండేవారు పొత్తూరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: