గాంధీ ఆసుపత్రిలో చేరిన సునీత కృష్ణన్..
ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు, మహిళల హక్కుల పోరాట కర్త సునీతా కృష్ణన్ కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి. అయితే.. ఆమె తన ఆరోగ్యంపై వస్తున్న ఎలాంటి నకిలీ వార్తలను, పుకార్లను నమ్మవద్దని ఆమె సోషల్ మీడియా ద్వారా కోరారు. కాగా., ఇంతకుముందు తాను బ్యాంకాక్ వెళ్లానని, అక్కడి నుంచి వచ్చినప్పటినుంచి దగ్గుతో బాధపడుతున్నానని ఈ విషయాన్ని ఆమె మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు పరీక్షల నిమిత్తం సునీతా కృష్ణన్ గాంధీ హాస్పిటల్ కు వెళ్లారు.
తనకు కరోనా పరీక్షలు పూర్తయ్యాయని.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నానని సోమవారం పేర్కొన్నారు. మంగళవారం తన కరోనా వైరస్ పరీక్షా ఫలితాలు వచ్చాయని, నెగటీవ్ అని తేలిందని ప్రకటించారు. దీంతో తనకు ఎంతో ఉపశమనం లభించనట్లయిందని ఆమె వెల్లడించారు. సునీతా కృష్ణన్ కు పద్మశ్రీ పురస్కారం లభించిన సంగతి తెలిసిందే.
చైనాలోని ఊహాన్ లో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) హైదరాబాద్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లుగా సోమవారం పరీక్షల్లో తేలింది. మరోవైపు, అతని కుటుంబసభ్యులు 8 మందిని కరోనా వార్డుకు తరలించి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారత్ లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
సికింద్రాబాద్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుబాయ్ వెళ్లిన సమయంలో అతనికి ఈ వైరస్ సోకినట్లుగా భావిస్తున్నారు. అక్కడి నుంచి బస్సులో బెంగళూరు మీదుగా ఈ యువకుడు హైదరాబాద్ వచ్చాడు. అతను ప్రయాణించిన బస్సులో 26 మంది ప్రయాణించారు. అనంతరం అతనికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రిలో చేరాడు. పరీక్షల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలడంతో దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.