
హైదరాబాద్ లో దారుణం.. ముగ్గురు పసివాళ్లు.. అన్యాయంగా చనిపోయారుగా..?
ఓ పాత గోడ ఆ చిన్నారుల పాలిట మృత్యువైంది. అప్పటివరకు ఆడిపాడిన చిన్నారులు అప్పుడే నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే ఓ పాతగోడ వారిని బలి తీసుకుంది. హైదరాబాద్ హబీబ్‌నగర్ పరిధిలోని మాంగార్ బస్తీలో మీఠలాల్ కుటుంబం నివాసముంటోంది. అతని ముగ్గురు కుమార్తెలతోపాటు అతని సోదరుని కూతురు ఇంట్లో ఆడుకున్నారు. ఆడుకుంటూనే ఆ చిన్నారులు నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే ఇంట్లోని పాత గోడ కూలి చిన్నారులపై పడింది. తీవ్ర గాయాలైన ఆరేళ్ల రోషిణి, రెండేళ్ల పావని, రెండు నెలల సారిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి గీతకు తీవ్రగాయాలయ్యాయి. ఘటన జరిగినప్పుడు ఇంటి బయట ఉన్న మీఠలాల్ దంపతులు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చిన్నారులు శవాలుగా మారిపోయారు. ఆ దృశ్యం చూసి ఆ తల్లిదండ్రుల గుండె ఆగినంత పనైంది. మట్టి పెల్లలను తొలగించి చూస్తే.. ఆ పిల్లలు అచేతనంగా పడి ఉన్నారు. పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న విషయం తలుచుకుని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగింది.