ప్రజా చైతన్యయాత్ర: పర్చూరులో ఇలా జరిగిందేంటి?

M N Amaleswara rao

తెలుగుదేశం పార్టీ ఘోరతిఘోరంగా ఓడిపోయి 9 నెలలు కావొస్తుంది. అయితే ఈ 9 నెలల కాలంలో టీడీపీ అనుకున్నంత ఏమి కోలుకోలేదు. మొదటి నెల నుంచి జగన్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తున్నారని చెబుతూ చంద్రబాబు పోరాడిన పెద్దగా ఫలితం రాలేదు. ఇసుక దీక్షలు, అన్న క్యాంటీన్ల రద్దు, ఛలో ఆత్మకూరు ఇలా చాలా విషయాల్లో పోరాటాలు చేసిన ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇక అమరావతి ఉద్యమం విషయంలో కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో కాస్త స్పందన వచ్చిన, మిగతా జిల్లాలో సొంత పార్టీ నేతలే సరిగా పట్టించుకోలేదు.

ఇక ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం నవ మోసాలు చేసిందని చెబుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడానికి బాబు ప్రజా చైతన్య యాత్రకు సిద్ధమయ్యారు. యాత్రని ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి మొదలుపెట్టారు. అయితే 9 నెలల్లో రాని స్పందన ఒక్కరోజులోనే వచ్చేసింది. పర్చూరు నియోజకవర్గంలో ప్రజలు బాబుకు బ్రహ్మరథం పట్టారు. అసలు మార్టూరు పరిసర ప్రాంతాలు పసుపుయమైపోయాయి. అసలు ఊహించని స్థాయిలో బాబు యాత్రకు జనం హాజరయ్యారు.

అయితే ఈ స్థాయిలో జనం వస్తారని చంద్రబాబే ఊహించి ఉండరు. ఇక ఈ రేంజ్‌లో పర్చూరు పసుపుమయం అవడానికి ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై ఉన్న అభిమానంతో పాటు, టీడీపీకి ఉన్న భారీ కేడర్ కారణమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంచిపనితీరు కనబరిచిన ఏలూరి,  2019 ఎన్నికల్లో దగ్గుబాటి లాంటి దిగ్గజాన్ని మట్టికరిపించి మరోసారి విజయం సాధించారు. పర్చూరు ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాడు కాబట్టి ఏలూరి మళ్ళీ ఎమ్మెల్యే కాగలిగారు.

 

ఇక ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ వల్లే ఇప్పుడు బాబు యాత్రకు భారీ స్థాయిలో జనం వచ్చారని తెలుస్తోంది. పైగా ప్రజల్లో కూడా వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉండటం, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పోరాటం చేస్తుండటంతో పర్చూరులో ప్రజల మద్ధతు భారీగా దక్కింది. మొత్తానికైతే పర్చూరులో ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు ఈ స్థాయిలో వస్తారని ఎవరు ఊహించలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: