ఐటి సోదాల రచ్చపై టిడిపి అంత ధైర్యం చేస్తుందా ?

Vijaya
ఏపిలో సంచలనంగా మారిన ఐటి దాడుల విషయంలో తెలుగుదేశంపార్టీ సంచలన నిర్ణయం తీసుకోబోతోందా ?  అసలు అంత ధైర్యం చేస్తుందా ? సోదాల తర్వాత మొదలైన రచ్చ విషయంలో ఐటి అధికారులను ప్రశ్నించే ధైర్యం టిడిపి చేస్తుందా ? అని అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే  ఐదు రోజుల సోదాల తర్వాత జరుగుతున్న రాజకీయ రచ్చకు సిబిడిటి ఉన్నతాధికారులు జారీ చేసిన ప్రెస్ నోటే అన్న విషయం అందరికీ తెలిసిందే.

సిబిడిటి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఆధారంగానే మంత్రులు, వైసిపి నేతలు చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు మూడు రోజులు తీవ్ర ఆరోపణలు చేశారు. మొదటి రెండు రోజుల ఏమి మాట్లాడాలో అర్ధంకాని టిడిపి నేతలు పూర్తిగా డిఫెన్స్ లోకి పడిపోయారు. ఆ తర్వాత మెల్లిగా కలుగులోంచి ఎలుకలు బయటకు వచ్చినట్లుగా వైసిపిపై ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో గమనించాల్సిన విషయం ఏమిటంటే అసత్య ఆరోపణలు చేసినందుకు వైసిపి నేతలపై కోర్టులో పరువునష్టం దావా వేస్తామని యనమల రామకృష్ణుడు లాంటి సీనియర్లు బెదిరింపులకు దిగారు. కానీ వాళ్ళు మరచిపోయిన విషయం ఏమిటంటే వైసిపి నేతల ఆరోపణలకు మూలమే సిబిడిటి జారీ చేసిన ప్రెస్ నోట్.  ప్రెస్ నోట్ లో సిబిడిటి కన్ఫ్యూజన్ గా కొన్ని వివరాలు ఇస్తే దానికి  వైసిపి నేతలు మసాలా జోడించారంతే.

ఇక్కడ పరువునష్టం వేయాలని టిడిపి నేతలు అనుకుంటే సిబిడిటిపైన కూడా వేయాలి. మరి టిడిపికి అంత ధైర్యముందా ? ఎందుకంటే ప్రెస్ నోట్ ఇచ్చిన సిబిడిటి పై ఇంత వరకూ టిడిపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రెస్ నోట్ లో ఉన్న విషయాలు తప్పని ఎక్కడా చెప్పటం లేదు. సిబిడిటి గురించి నెగిటివ్ గా మాట్లాడితే ఎవరికి ఏమవుతుందో అన్న టెన్షన్ టిడిపి నేతల్లో పెరిగిపోతోంది. అందుకనే రచ్చకు మూలమైన సిబిడిటి గురించి మాట్లాడకుండా వైసిపి నేతల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు టిడిపి నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: