మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
ఈ మధ్య కాలంలో మ్యాట్రిమోనీ మాయలో పడి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సైబర్ నేరగాళ్లు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లను వేదికగా చేసుకొని తాజాగా మోసాలకు పాల్పడుతున్నారు. ఆఫ్రికన్ దేశాలకు చెందిన నైజీరియన్ మోసగాళ్లు ఈ తరహా మోసాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. పెళ్లి సంబంధాల కొరకు ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయిలను, అబ్బాయిలను మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు.
పోలీసులు ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోనీ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు పెరిగిపోతున్నాయని వివిధ వెబ్ సైట్లలో ప్రొఫైల్ ను అప్ లోడ్ చేస్తున్న యువతులు, యువకులు తాము లక్షల్లో సంపాదిస్తున్నామని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెబుతూ పరిచయాలు పెంచుకుని బహుమతులు పంపిస్తామని చెప్పి అమాయకుల నుండి డబ్బు లాగేస్తున్నారని చెబుతున్నారు. సైబర్ మోసగాళ్లు తమను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారని చెబుతూ అమాయకుల నుండి లక్షల్లో దోచుకుంటున్నారు.
ఆ తరువాత ఫోన్ నంబర్లను మార్చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసి మోసాలు చేస్తున్నారు. అందమైన యువతీయువకులను పెళ్లి చేసుకోవాలని భావించేవారే ఎక్కువగా వీరి మాయలో పడుతున్నారు. సైబర్ మోసగాళ్లు గూగుల్ నుండి అందమైన అమ్మాయిల ఫోటోలను డౌన్ లోడ్ చేసుకుని వాటితో ప్రొఫైల్స్ సృష్టించి సందర్భానికి తగినట్లు వాయిస్ మార్చి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు.
పోలీసులు మ్యాట్రిమోనీ వెబ్ సైట్లను వేదికగా చేసుకొని మోసాలకు పాల్పడేవారి విషయంలో వెబ్ సైట్ నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. వెబ్ సైట్ నిర్వాహకులు మ్యాట్రిమోనీ మోసాలకు పాల్పడుతున్న యువకులను గుర్తించాలని మోసాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్ లైన్ లో పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న యువతీయువకులు కూడా మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.