ఆ షిప్‌లో 61 మందికి కరోనా వైరస్ పాజిటివ్... ఆందోళనలో మిగతా ప్రయాణికులు...?

Reddy P Rajasekhar

క్రూయిజ్ షిప్ లోని ప్రయాణికులలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జపాన్ నిర్భంధంలో ఉన్న క్రూయిజ్ షిప్ లో విడతల వారీగా వైద్యులు పరీక్షలు జరుపుతుండగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సిబ్బందితో కలిసి ఓడలో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. రెండు రోజుల క్రితం 270 మంది ప్రయాణికులకు పరీక్షలు జరపగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
ఆ తరువాత విడతల వారీగా చేసిన పరీక్షల్లో బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగింది. తాజాగా నిన్న జరిపిన పరీక్షలతో క్రూయిజ్ షిప్ లోని ప్రయాణికులలో మొత్తం 61 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జపాన్ ఆరోగ్య శాఖ ఈ షిప్ ను 14 రోజుల పాటు నిర్భంధంలో ఉంచనుంది. ఆ తరువాత కరోనా బాధితుల పరిస్థితులను బట్టి కీలక నిర్ణయాలను ప్రకటించనున్నట్టు పేర్కొంది. అధికారులు కరోనా వైరస్ బాధితులను చికిత్స కోసం టోక్యో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వైద్య కేంద్రాలకు తరలిస్తున్నారు. 
 
జపాన్ ఆరోగ్య శాఖ అధికారులు జపాన్ లో మాత్రం ఇప్పటివరకూ కరోనా వైరస్ బారిన పడి ఒక్కరు కూడా మృతి చెందలేదని తెలిపారు. డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లోని ప్రయాణికులు మరియు సిబ్బంది 14 రోజులపాటు నిర్భంధంలో ఉండాల్సిందేనని మరోసారి జపాన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. హాంకాంగ్ లో కరోనా వైరస్ సోకిన వ్యక్తి షిప్ లో ఎక్కడంతో ఈ వైరస్ షిప్ లోని మిగతా ప్రయాణికులకు సోకింది. 
 
మరోవైపు చైనాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడి చైనాలో 636 మంది మృతి చెందారు. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ లెక్కల ప్రకారం కరోనా వైరస్ బాధితుల సంఖ్య 31,000కు చేరింది. కరోనా వైరస్ కు మెడిసిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో కరోనా వైరస్ కు మందును మాత్రం ఇప్పటికీ పరిశోధకులు కనిపెట్టలేకపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: