నకిలీ మద్యం కేసులో మాజీ డిప్యూటీ సీఎం సోదరుడు !

NAGARJUNA NAKKA

కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం కేసు హాట్ టాపిక్ గా మారింది. మాజీ డిప్యూటీ సీఎం కెేఈ క్రిష్ణమూర్తి సోదరుడు కెయి ప్రతాప్ సహా వారి అనుచరులపై నకిలీ మద్యం కేసు నమోదు చేయడం, వారి ఇళ్లలో పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. కేఈ కుటుంబం టార్గెట్ గా దర్యాప్తు జరుగుతోందా.. అప్పట్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన అనుచరులపై ప్రవర్తించిన తీరుకు ప్రతీకారం తీర్చుకుంటున్నారా అనే చర్చ మొదలైంది. 

 

కర్నూలు డోన్ లో మాజీ డిప్యూటీ సీఎం కెయి కృష్ణ మూర్తి సోదరుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జి  కెేఈ ప్రతాప్ తోపాటు వారి అనుచరుల ఇళ్లలో పెద్ద ఎత్తున పోలీసులు సోదాలు చేయడం చర్చనీయాంశమైంది. నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న కేఈ ప్రతాప్ తోపాటు సుమారు 20 మంది ఇళ్లలో ఏకకాలంలో సుమారు 100 మంది పోలీసులు సోదాలు చేశారు. కర్నూలులోను కేఈ ప్రతాప్ ఇంట్లో సోదాలు చేశారు. డోన్ లో దాదాపు 22 ఖాళీ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. డోన్ లో నకిలీ మద్యం తయారీ కేసులో సుమారు 36 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 22 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. 

 

గత డిసెంబర్ 7న క్రిష్ణగిరి మండలం అమకతాడులో పెద్ద ఎత్తున నకిలీ మద్యం స్వాధీనం చేసుకొని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులు జైపాల్ రెడ్డి, బ్రహ్మానందరెడ్డితో పాటు మరికొందరిని అరెస్టు చేశారు.  డిసెంబర్ 29న డోన్ మండలం, ఉడుములపాడులో రాంబాబు అనే టీడీపీ కార్యకర్త అండర్ గ్రౌండ్ లో భారీ ఎత్తున మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు చేశారు. ఈరెండు కేసు విచారణలో కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున స్పిరిట్ తెచ్చి అన్ని రకాల బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టు తేలింది. కర్నాటక హుబ్లీలో వినోద్ కల్లాల్  అనే వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్పిరిట్ ఇతర సామాగ్రి సరఫరా చేస్తున్నారు. దీంతో మొదట వినోద్ కల్లాల్ కుమారుడు రోహిత్ కల్లాల్, ఆ తరువాత వినోద్ కల్లాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. డోన్ లో మద్యం సిండికేట్ కు పెద్ద ఎత్తున నకిలీ మద్య సరఫరా చేసినట్టు వినోద్ కల్లాల్ పోలీసు విచారణలో చెప్పారట. దీంతో సుమారు 36 మంది నిందితులుగా చేరుస్తూ ఎక్సైజ్ యాక్ట్ 34 ఎతోపాటు 328, 420, 420బి, రెడ్ విత్ 34 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు . ఇందులో కీలక వ్యక్తులు మాజీ డిప్యూటీ సిఎం కెయి ప్రతాప్, ఆయన పిఎ పుట్లూరు శ్రీను, మద్యం సిండికేట్ నిర్వహించే అయ్యన్న కూడా ఉన్నారు. ఇప్పటికే 22 మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు నుంచి సర్చ్ వారెంట్ తీసుకొని తాజాగా నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. కెయి ప్రతాప్ కాని, కుటుంబ సభ్యులు కాని ఆ సమయంలో ఇంట్లో లేరు. కేవలం పనిమనుషులు ఉన్నారు. కెయి ప్రతాప్ ఇంట్లో 22 ఖాళీ క్యాన్ లు లభించాయి. ఈ క్యాన్లు దేని కోసం వినియోగించారని పరీక్షించి వెల్లడిస్తామన్నారు పోలీసులు. అయితే అవి డీజిల్, ఫినాయిల్ క్యాన్లని, అందులో ఏవీ లేవని కెయి ప్రతాప్ ఇంటి పని మనుషులు చెబుతున్నారు. దీంతో డోన్ లో కెయి అనుచరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరిపై ఎప్పుడు కేసు నమోదు అవుతుందోనన్న అందోళన కనిపిస్తోంది.  

 

కర్నూలు జిల్లాలో నకిలీ మద్యం కేసు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కెయి కుటుంబం టార్గెట్ గా నకిలీ మద్యం కేసు దర్యాప్తు చేస్తున్నారా...గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుతం మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన అనుచరుల పట్ల కెయి కుటుంబం వ్యవహరించిన తీరుకు ప్రతీకారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందా అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. డోన్ లో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం వ్యాపారం జరిగితే అధికార యంత్రాంగం ఏళ్ల తరబడి ఎందుకు గుడ్లప్పగించి చూసింది అనే ప్రశ్న తలెత్తుతోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ వైసిపి ఎమ్మెల్యేగా గెలిచినా టిడిపి హయాంలో కెయి ప్రతాప్ ఎమ్మెల్యే హోదా నడిపారనేది వైసిపి వర్గాల వాదన. అభివృద్ధి నిధులు ఇవ్వకపోగా ఎమ్మెల్యే బుగ్గనపైనా, ఆయన అనుచరులపైనా కేసులు పెట్టించారని, కొందరిపై దాడులు చేశారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్వంత మైనింగ్ నిలిపివేయించారని, అప్పటి సిఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారని చెబుతున్నారు. మున్సిపల్ వేలాల సందర్భంగా బుగ్గన అనుచరులపై పట్టపగలే విచక్షణా రహితంగా ఇనుపరాడ్లతో దాడులు చేశారని, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్రీరాములుపై కేసులు పెట్టించారని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రావడం, నకిలీ మద్యం వ్యవహారం వెలుగుచూడడంతో కెయి కుటుంబం టార్గెట్ గా కేసు దర్యాప్తు కొనసాగుతుందా అనే చర్చ జరుగుతోంది. ఆ మధ్య కాలంలో కెయి కుటుంబం వైసిపిలో చేరుతుందంటూ ప్రచారం జరిగింది. టిడిపిని వీడేది లేదని కేఈ ప్రతాప్ కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా కేఈ  క్రిష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, కేఈ ప్రతాప్ , కేఈ శ్యామ్ బాబు అంత చురుగ్గా కూడా లేరు.  తరచూ నియోజకవర్గాలకు వచ్చి వెళ్తున్నారు. ఈనేపథ్యంలో కేఈ ప్రతాప్ పై నకిలీ మద్యం కేసు నమోదు కావడం, పెద్ద ఎత్తున నిందితుల ఇళ్లలో సోదాలు చేయడం చర్చనీయాంశమైంది.

 

నకిలీ మద్యం కేసు, కేఈ ఇళ్లలో సోదాలపై అటు కెేఈ కుటుంబం నుంచి గానీ, టీడీపీ నుంచి కానీ నోరు మెదపడం లేదు. ఇదంతా కక్షసాధింపు చర్య, వేధింపులు అంటూ టిడిపి వర్గాలు ప్రైవేటు సంభాషణలో చెబుతున్నాయి తప్ప బహిరంగంగా మాట్లాడ్డం లేదు. వైసీపీ వర్గాలు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అంటున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా ఇళ్లలో సోదాలు చేసి ఉంటారని అంటున్నారు. మొత్తం మీద నకిలీ మద్యం కేసు కర్నూలు జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసుపైనా, దర్యాప్తుపైనా రాబోయే రోజుల్లో వైసీపీ, టీడీపీ ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: