మేడారం సమ్మక్క-సారక్క జాతర : మేడారంలో ఏ ఊరు చూసినా తల్లుల పేర్లే..!

NAGARJUNA NAKKA

భక్తి పారవశ్యం.. అడుగడుగునా భక్తుల పూనకాలు.. పిల్లాపాపలతో సందడి చేస్తున్న కుటుంబాలు.. తల్లుల నామస్మరణతో  మేడారం తన్మయత్వం చెందుతోంది.  ఒక పక్క తల్లి సమ్మక్క.. మరో పక్క బిడ్డ సారలమ్మ కొలువుదీరిన గద్దెల వద్ద మొక్కులు తీర్చుకునే భక్తుల తాకిడి అపరిమితంగా మారింది.

 

గిరిజన వన దేవతలు శ్రీ మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే క్రమంలో మేడారం జాతర వివిధ మార్గాల్లో ప్రతిష్ఠితమైన అనుబంధ దేవత ‘‘గట్టమ్మ తల్లి’ని భక్తులు దర్శించుకున్న తర్వాత మేడారం సమ్మక్క, సారలమ్మ దివ్య సన్నిధికి బయలుదేరి వెళతారు.  వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి గుడులు ఉన్నప్పటికీ ములుగు గట్టమ్మ తల్లికి ఇంచుమించు సమ్మక్క, సారలమ్మ తల్లులంత వైభవాన్ని సంతరించుకుంది. మేడారం ములుగు మార్గంలో ఉన్న ఈ తల్లిని ముందుగా దర్శించుకుని తొలి పూజలు జరిపాకే భక్తులంతా మేడారంకు వెళతారు. గట్టమ్మ తల్లిని దర్శించుకుంటే సమ్మక్క, సారలమ్మ తల్లి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందన్న విశ్వాసం మెండుగా భక్తుల్లో నాటుకుపోయింది. ములుగు సమీపానగల గట్టమ్మ తల్లిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య దినదినం పెరుగుతోంది. 

 

గట్టమ్మ తల్లి చరిత్రను తెలుసుకునేందుకు ప్రతీ భక్తుడు ఆరాటపడతాడు. సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు, జంపన్న, గోవిందరాజు, సోమక్క, లక్ష్మక్కలు కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తితో మేడారం గిరిజన రాజ్య స్వతంత్రం కోసం, గిరిజనుల సాధికారత కోసం భీకర యుద్ధం సాగించారు. ఈ క్రమంలో సమ్మక్క తల్లికి గట్టమ్మ తల్లి అంగరక్షకురాలిగా శత్రువులతో యుద్ధం చేసి గొప్ప యుద్ధవీరవనితగా పేరు తెచ్చుకుంది. గట్టమ్మతల్లితో పాటు అంగరక్షకులుగా సూరపల్లి సూరక్క, మారపల్లి మారక్క, కోడూరు లక్ష్మక్క తదితరులు సమ్మక్క తల్లిని యుద్ధంలో శతృవుల ఆయుధాల దాడి నుంచి కాపాడుతూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి అమరులయ్యారు.  అందుకే ఈ అమర వీరులను కూడా గిరిజనులు దేవతలుగా మలుచుకుని వారికి గుళ్ళు కట్టి వారి స్మృతికి నివాళులుగా వారికి పూజలు చేస్తున్నారు. అంతేకాదు తమ గ్రామాలకు ఆ దేవతల పేర్లు కూడా పెట్టుకొని తమ అభిమానాన్ని, భక్తిని చాటుకుంటున్నారు. 

 

మేడారంలోని సమ్మక్క, సారలమ్మ దేవతలకు పూజూరులున్నట్లే పరివార వనదేవతలకు సహితం ఆయా ప్రాంతాల్లో ఉన్నారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని నగరం పల్లిలో సమ్మక్క తల్లి ఇంటి ఆడపడుచు లక్ష్మీ దేవక్కకు పూజారులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: