సమత అత్యాచారం, హత్య కేసులో తుది తీర్పు నేడే.... ఉరిశిక్ష పడే అవకాశం...?
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన తుది తీర్పును నేడు కోర్టు వెలువరించనుంది. నవంబర్ 24వ తేదీన అదిలాబాద్ జిల్లాలోని ఎల్లపటూర్ లో సమత అదృశ్యమైంది. సమత అదృశ్యమైన రోజున ముగ్గురు నిందితులు సమతను అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేశారు. సమత భర్త గోపి ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సమత అత్యాచారం, హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో త్వరగా తీర్పు వెలువడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. యుద్ధ ప్రాతిపదికన ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు గురించి విచారణ జరిగింది. సమత అత్యాచారం, హత్యకు సంబంధించిన వాదనలు ఈ నెల 20వ తేదీనే పూర్తయ్యాయి.
ఈ నెల 27వ తేదీన అదిలాబాద్ స్పెషల్ కోర్టు తీర్పును వెలువరించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన తీర్పు ఈరోజుకు వాయిదా పడింది. షేక్ మగ్దూమ్, షేక్ షాబుద్దీన్, షేక్ బాబా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్ లో సమతను అత్యాచారం చేసి హత్య చేశారు. ఎల్లాపటార్ గ్రామస్థులు నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సమత బంధువులు, గ్రామస్థులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన శిక్షలు విధించాలని అప్పుడే ఇలాంటి నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష విధించగా సమత కేసు నిందితులకు కూడా అలాంటి శిక్షే విధించాలని సమత బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.