ఏపీ పాలిటిక్స్‌లో కలకలం.. రాజీనామాపై మంత్రి క్లారిటీ...?
2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. కానీ వైసీపీ పార్టీ నుండి పోటీ చేసినప్పటికీ కొందరు ప్రముఖులు 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అలా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వారిలో మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రభుత్వం శాసన మండలి రద్దుకు తీర్మానం చేసి ఆ తీర్మానానికి ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
శాసన మండలిని రద్దు చేయడంతో మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. మంత్రి పదవిలో ఉండాలంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయి ఉండాలి. ఈ రెండూ లేకుండా మంత్రి పదవికి అర్హులు కాదు. శాసన మండలి రద్దైతే మాత్రం వీరిరువురూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ శాసన మండలి రద్దుకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఓటింగ్ ద్వారా ఆమోదం తెలిపటంతో వైసీపీ నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామాల గురించి ప్రచారం జరుగుతూ ఉండటం, రకరకాల వార్తలు వస్తూ ఉండటంతో మోపిదేవి వెంకటరమణ రాజీనామా వార్తల గురించి స్పందించారు. ఈరోజు అమరావతిలో మోపిదేవి మీడియాతో మాట్లాడారు. మండలి రద్దు గురించి కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కేంద్రం నుండి సమాచారం వస్తే వెంటనే రాజీనామా చేస్తామని చెప్పారు.
మంత్రి పదవులకు రాజీనామా చేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన మంత్రి పదవులకు రాజీనామా చేయడం వీలు కాదని చెప్పారు. మరోవైపు సీఎం జగన్ ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినప్పటికీ తాను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పినట్టు సమాచారం.