ఈరోజే కేజ్రీవాల్ నామినేషన్.. మేనిఫెస్టోపై ప్రజల ప్రశంసలు ...?

Reddy P Rajasekhar

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించటం కొరకు ఈరోజు న్యూఢిల్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేయనున్నారు. భారీ రోడ్ షోలతో వాల్మీకి భగవానుడి ఆశీర్వాదం తీసుకొని కేజ్రీవాల్ నామినేషన్ వేయనున్నారు. గతంలో పెద్దగా ఖర్చుల జోలికి, ప్రచారం జోలికి వెళ్లని కేజ్రీవాల్ మిగతా రాజకీయనాయకుల రూట్లోనే వెళుతూ ఎన్నికల్లో నామినేషన్ వేయనున్నారు. 
 
ఢిల్లీ ప్రజలను తన రోడ్ షోలో పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో గత ఎన్నికల్లో ఆప్ 67 సీట్లలో గెలిచి ఘన విజయం సాధించింది. బీజేపీ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాలకు పరిమితమై ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గత ఎన్నికల్లో నిరాశే ఎదురుకాగా ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని సమాచారం. 
 
నిన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు ఎన్నికల వరాల జల్లు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే తాను చెప్పే పది హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తానని కేజ్రీవాల్ చెప్పారు. కేజ్రీవాల్ కేజ్రీవాల్ కా గ్యారంటీ కార్డు పేరుతో ఎన్నికల హామీలను ఆవిష్కరించారు. పార్టీని గెలిపిస్తే 24 గంటలు తాగునీరు, వచ్చే ఐదు సంవత్సరాలు కరెంట్, ఇల్లు, పారిశుద్ధ్యం, ఇంటర్ వరకు విద్య, వైద్యం ఉచితంగా అందిస్తానని హామీ ఇచ్చారు. 
 
విద్యార్థులు మరియు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని నిరుపేదలకు ఉచితంగా ఇల్లు కట్టిస్తామని చెప్పారు. యమునా నదిని ప్రక్షాళన చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈరోజు కన్నాట్ ప్లేస్ నుండి మొదలయ్యే రోడ్ షో పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర ముగియనుంది. మరోసారి తమకు అధికారం అప్పగిస్తే.. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ ఇచ్చిన హామీలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీ ప్రజలు ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: