13 జిల్లాలకే మూడుంటే... 33 జిల్లాలకు ఎన్ని ఉండాలి?

Balachander

రాజధాని తరలింపును సమర్థిస్తూ, ర్యాలీలు, ధర్నాలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నడిరోడ్లపైకొచ్చి అభినవకట్టప్పల్లా మారి అమరావతికి వెన్నుపోటు పొడుస్తున్నారని టీడీపీసీనియర్‌నేత, మాజీఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మండిపడ్డా రు.  పుట్టినప్రాంతానికి, కన్నతల్లి వంటి జన్మభూమికి ద్రోహం చేస్తున్న అధికార పార్టీనేతలంతా అమరావతి ద్రోహులుగా మిగిలిపోయారన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, గద్దెనెక్కాక మరోలా మాట్లాడటం జగన్‌కు బాగా వంటపట్టిందని, ఆవిద్యతోనే ఆయన ప్రజల్ని మోసం చేస్తున్నాడని నరేంద్ర దుయ్యబ ట్టారు. 

 

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు మర్చిపోయేలా చేయడానికి రోజుకోవిధంగా  కపటనాటకాలు ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనావ్యవస్థను ముక్కలు చేయడం, రాజధానిని విభజించడం ఎంతవరకు సమంజసమని నరేంద్ర ప్రశ్నించారు. కర్నూల్లో హైకోర్టు పెడితే రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే అన్నిరంగాల్లో ముందంజలోఉన్న విశాఖజిల్లాలో రాజధానిపెడితే, అక్కడేం ఒనగూరుతుందని ధూళిపాళ్ల నిలదీశారు. 

 

అభివృద్ధిలో అన్ని జిల్లాలకంటే, విశాఖ అత్యున్నతస్థానంలోనే ఉందన్నారు. రాబోయేరోజుల్లో విశాఖ వాసులు ధృతరాష్ట్రకౌగిలిలో చిక్కుకోబోతున్నారనే విషయాన్ని ఆప్రాంతవాసులకు ఇప్పటికే అర్థమైందన్నారు. ప్రపంచంలో ఎక్కడాకూడా  ఈ విధమైన విభజన జరగలేదని, కేంద్రప్రభుత్వం కూడా పరిపాలనావ్యవస్థలన్నింటినీ  ఒకేచోట కేంద్రీకృతం చేస్తోందన్నారు. ప్రధాని నివాసం, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతుల నివాసాలు, అన్నిరకాల డైరెక్టరేట్లు ఒకేచోట ఉండేలా ఇప్పటికే ప్రణాళికలు రూపొందిచా రని ధూళిపాళ్ల పేర్కొన్నారు. 

 

జగన్‌ నిర్ణయాలను సమర్థిస్తూ, మూడురాజధానులు అద్భుతమని పొగిడిన కేసీఆర్‌, తనరాష్ట్రాన్నికూడా ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలుగా విభజిస్తాడా అని నరేంద్ర నిలదీశారు. రాష్ట్రంలోని ఆందోళనలవల్ల ఎక్కువగా లాభపడు తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ఏపీలో రగిలిన మంటల్లో తెలంగాణ చలికాచుకుం టోందని, 13జిల్లాలకే మూడు పరిపాలనాకేంద్రాలుంటే, 33జిల్లాలకు ఎన్ని కేంద్రాలుండాలో, ఆవిధంగా చేయడానికి తెలంగాణ సర్కారు ముందుకెళుతుందా అని టీడీపీ నేత ప్రశ్నించారు. కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా, పుల్లయ్యఉన్నా చొక్కాపట్టుకొని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తీసుకొస్తానన్న జగన్‌, ఇప్పుడు ప్లీజ్‌ప్లీజ్‌ అంటూ మోదీకాళ్లు పట్టుకునే స్థితికి చేరాడని నరేంద్ర ఎద్దేవాచేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: