అణుయుద్దానికి ఇరాన్ సంకేతాలు !

NAGARJUNA NAKKA

పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. జనరల్‌ సులేమానీపై అమెరికా దాడితో పశ్చిమాసియా అణు సంక్షోభం అంచులకు చేరింది. అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌ రగిలిపోతోంది. 2015 నాటి చరిత్రాత్మక అణు ఒప్పందంలోని నిర్దేశించిన ఆంక్షలకు తాము కట్టుబడబోమని స్పష్టం చేసింది. ఇన్‌డైరక్ట్‌గా అణుయుద్ధానికి మేం రెడీ అంటూ ప్రకటించింది ఇరాన్‌. మరి అణ్వస్త్రం తయారు చేయడానికి ఇరాన్‌ ఎంత దూరంలో ఉంది..? ఇరాన్‌ను ఆపేందుకు అమెరికా ముందున్న అవకాశాలేంటి..?

 

అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొనడంతో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధన నుంచి సైతం విరమించుకుంటామని ప్రకటించింది. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఈ ఒప్పందం నుంచి  2018లో అమెరికా బయటకు వచ్చింది. దీంతో ఇరాన్‌ సైతం ఒక్కో నిబంధనను అతిక్రమిస్తూ వస్తోంది. యురేనియం నిల్వలు, వాటి శుద్ధి స్థాయిని పెంచుకున్నట్లు ప్రకటించింది. యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం పక్కనపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో అణు ఒప్పందం నుంచి ఇరాన్‌ పూర్తిగా బయటకు వచ్చినట్టయింది. ఇరాన్‌ నిర్ణయం పట్ల ఒప్పందంలోని ఇతర భాగస్వామ్య దేశాలు  విచారం వ్యక్తం చేశాయి.  ప్రస్తుతానికి ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. 

 

భద్రతా మండలి శాశ్వత సభ్య  దేశాలు 2015లో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకున్నాయి. ఈ అణుఒప్పందం కీలక అంశాలపై దృష్టిపెట్టింది. ఇరాన్‌ తన వద్ద అణు నిల్వలను తగ్గించుకోవడం, యురేనియం శుద్ధి, సెంట్రిఫ్యూజ్‌ సంఖ్య కుదింపు ఇలా అణుబప్పందంలో పలు అంక్షలకు అప్పట్లో ఇరాన్‌ ఒప్పుకుంది. ఈ అంశాలను ఇరాన్‌ సంతృప్తికరంగా అమలు చేస్తే ఆర్థిక ఆంక్షలను తొలగించాలి. అమెరికా, ఐరాస, ఐరోపా సంఘాం వీటిని అమలుచేయాలి. అయితే ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక 2018లో ఈ ఒప్పందాన్ని చెత్తబుట్టలో పడేశారు.

 

అమెరికా అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చాక.. ఇరాన్‌ కూడా మెల్లిగా ఈ డీల్‌లోని ఆంశాలను పక్కనబెడుతూ వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఇరాన్‌ ఎంత వేగంగా చేసినా అణుబాంబు తయారీకి కనీసం ఏడాది సమయం పట్టొచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2015 నాటి ఒప్పందానికి ముందు నాటి స్థాయిలో సెంట్రీఫ్యూజ్‌లను మళ్లీ వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పటికే  ఇరాన్‌ తన యురేనియం శుద్ధి స్థాయిని పెంచింది. ప్రస్తుతం ఇరాన్‌ వద్ద నాటెన్జ్‌, ఫోర్డో యురేనియం శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ యురేనియం హెక్సాఫ్లొరైడ్‌ గ్యాస్‌ను సెంట్రీఫ్యూజ్‌ల్లోకి  పంపి యురేనియంను వెలికి తీస్తారు. 2016లో ఐఏఈఏ తనిఖీల ప్రకారం ఇరాన్‌ వద్ద అణుబాంబు తయారు చేయడానికి అవసరమైన పరికరాలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో లేవు. కానీ, అణుబాంబు తయారీకి అవసరమైన యురేనియం మాత్రం ఉంది.

 

అయితే అణు ఒప్పందం నుంచి ఇరాన్‌ తప్పుకోవడంపై ట్రంప్‌ ఘాటుగా స్పందించారు. ఆ దేశం ఎప్పటికీ అణ్వస్త్రాన్ని సాధించలేదని ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌పై ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో ఇరాన్‌లోని అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడి చేయచ్చు. గతంలో సిరియా వంటి దేశాల్లో అమెరికా ఇటువంటి దాడులను చేసింది. ఇది అధికారికంగా చెప్పకపోయినా.. ప్రపంచానికి ఈ విషయం తెలుసు. అదే విధంగా ఇరాన్‌ యురేనియం శుద్ధి కేంద్రాల కంప్యూటర్లపై సైబర్‌ దాడి చేయవచ్చు. మాల్‌వేర్‌తో సెంట్రీ ప్యూజ్‌లను దెబ్బతీసే అవకాశం ఉంది. మొత్తానికి ఇరాన్‌, అమెరికాల వ్యవహారం మిగతా దేశాలకి పెద్ద తలనొప్పిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: