రాజధాని విషయంలో ఎన్నో మార్పులు !
ఆంధ్రులకు రాజధానిపై శాపం ఉందా? అవుననే అనిపిస్తోంది... చరిత్రను పరిశీలిస్తే..! పిల్లి తన పిల్లల్ని ఇంటింటికి తిప్పినట్లుగా... ఆంధ్రప్రదేశ్ పాలకులు రాజధానిని ఒక్కో నగరానికి మార్చుకుంటూ తిరుగుతున్నారు. రాజధాని మారినపుడల్లా పెట్టాబేడా సర్దుకుంటున్నారు. నాటి మద్రాసు నుంచి నేటి అమరావతి అయోమయం వరకు ఆంధ్రుల రాజధాని విషయంలో ఎన్నో మార్పులు. మరెన్నో ట్విస్టులు.
ఆంధ్రుల రాజధాని ఏదని ఎవరైనా ప్రశ్నిస్తే... కాలానుగుణంగా నగరాల పేర్లను వరుసగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు రాజధాని అంటే ఒక్క నగరం పేరు చెప్పుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా కనిపించడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటుకానున్నాయంటూ నిండు సభలో సీఎం వైఎస్ జగన్ క్లారిటీగా చెప్పేశారు.
చరిత్రలోకి వెళ్తే.... ఆంధ్రులకు రాజధానులు పదికి పైగానే కనిపిస్తాయి. రాజులకాలంలో పాలకులు మారినప్పుడల్లా రాజధానులు మారిపోయాయి. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు పాలన సౌలభ్యం కోసం ఇలా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. అదేంటోగానీ స్వతంత్రం కూడా ఆంధ్రులకు రాజధాని విషయంలో స్థిరత్వం లేని పరిస్థితి కొనసాగింది. డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అదే అయోమయం ఆంధ్రులను వెక్కిరిస్తోంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఆంధ్రులు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండటంతో... అప్పుడు మద్రాసు రాజధానిగా కొనసాగింది. ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల నిరాహార దీక్ష చేసి మరణించారు. అప్పుడు 1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. మద్రాసు రాష్ట్రానికి ఉత్తరాన ఉన్న 11 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిని చేశారు. దీంతో మద్రాసు నుంచి రాజధాని కర్నూలుకు మారింది. గుంటూరులో హైకోర్టు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 1956 నవంబర్ 1న ఏర్పడింది. తెలుగు మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించగా... హైదరాబాద్‌ను రాజధానిగా ఏర్పాటు చేశారు. దీంతో మళ్లీ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మారిపోయింది. ఆంధ్రులంతా హైదరాబాద్‌ను రాజధానిగా భావించి... అభివృద్ధిలో భాగమయ్యారు.
తెలంగాణ ఉద్యమంతో ... మరోసారి ఆంధ్రులకు రాజధానిని వదులుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో.... 58 ఏళ్లపాటు తమ రాజధానిగా భావించిన హైదరాబాద్... ఆంధ్రులకు కాకుండా పోయింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అప్పటి ప్రభుత్వం అమరావతిని ఏర్పాటుచేసింది. దేశంలోని పేరున్న నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలని సంకల్పించింది. ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. ఐదేళ్లు తిరిగే సరికి ప్రభుత్వం మారిపోయింది. రాజధానిపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి.
కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజధానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజధానిని తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం జీఎన్‌రావు కమిటీని నియమించింది. ఇంతలోనే స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలోనే మూడు రాజధానులు ఉంటే పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. సీఎం జగన్ ప్రకటనతో ఆంధ్రులకు స్థిరమైన రాజధాని ఉండదా అనే అంశం మరోసారి చర్చకు వస్తోంది. రాజధాని విషయంలో ఆంధ్రులకు ఏమైనా శాపముందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా... ఆంధ్రులు రాజధానిగా ఒక్కనగరాన్ని బలంగా చెప్పుకోలేని పరిస్థితి నాటి నుంచి నేటిదాకా కొనసాగుతోంది.