ఆ తెలంగాణ ఎంపీకి భ‌లే చిక్కొచ్చి ప‌డిందే... మాట త‌ప్పిన‌ట్టేనా...!

VUYYURU SUBHASH

నిజామాబాద్ ఎంపీ అరవింద్‌కు  పసుపు రైతుల సెగ తగులుతోంది. పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా బీజేపీ నేత‌లు, ఎంపీ అర‌వింద్ త‌న‌ను గెలిపిస్తే ప‌సుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. ఎన్నిక‌లు ముగిసి ఆరు నెల‌లు దాటినా ప‌సుపు బోర్డు ఏర్పాటుపై  ఎలాంటి క‌ద‌లికల్లేక‌పోవ‌డంతో రైతులు మ‌ళ్లీ ఆందోళ‌న‌బాట ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. నిజామాబాద్ పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో సోమ‌వారం ప‌లు మండ‌లాల్లో రైతులు ఆందోళ‌న నిర్వ‌హించ‌డం ఇప్పుడు రాజ‌కీయ వేడిని పెంచుతోంది. అయితే దీని వెనుక టీఆర్ ఎస్ నేత‌లు ఉన్నార‌న్నా ఆరోప‌ణ‌లు అప్పుడే మొద‌ల‌య్యాయి.

 

రైతులు మాత్రం తామేమీ కొత్త కొరిక‌లు కోరడం లేదని ఎంపీ అర‌వింద్ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీనే నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేస్తున్నారు. ఎంపీగారు  ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్థానిక రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంపీ  అర‌వింద్ జిల్లాలో మాట్లాడ‌టం త‌ప్పించితే కేంద్రం నుంచి ఒక్క ప్ర‌క‌ట‌న కూడా సానుకూలంగా ఇప్పించ‌లేక‌పోయార‌ని ప‌లువురు రైతులు మండిప‌డుతున్నారు. నిండా నిర్ల‌క్ష్య ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని  రైతులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అరవింద్‌కు పసుపు బోర్డు తేవ‌డం అన్న‌ది  ప్రతిష్టాత్మకంగా మారింది.

 

పసుపు బోర్డు మంజూరుపైనే ఇప్పుడు నిజామాబాద్‌లో బీజేపీ మ‌నుగ‌డ‌..అర‌వింద్ రాజ‌కీయ ఎదుగుద‌ల ఆధార‌ప‌డి ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. బోర్డు మంజూరు కాలేదంటే బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం కావడంతోపాటు అరవింద్‌కు వ్య‌క్తిగ‌తంగా భారీగానే డ్యామేజ్ అయ్యే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో సీఎం కూతురు కల్వకుంట్ల కవిత అర‌వింద్‌పై ఓడిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం కేసీఆర్ ఫ్యామిలీకి రాజ‌కీయంగా పెద్ద‌దెబ్బ‌గా మారింది. క‌విత అయితే నాటి నుంచి క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌సుపుబోర్డు అంశం రాజ‌కీయ తెర‌మీద‌కి రావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో  ఆస‌క్తిక‌రంగా మారింది. చూడాలి ఏం జ‌రుగుతుందో..?!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: