విద్యార్థిని ఆత్మహత్య కేసు సీబీఐ చేతికి.. !

NAGARJUNA NAKKA

మద్రాస్ ఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఫాతిమా లతీఫ్ కేసును తమిళనాడు సర్కారు సీబీఐకి ఇచ్చింది. తమిళనాడు పోలీసుల ఎఫ్ఐఆర్ పై అనుమానాలు రావడం, కేరళ సీఎం స్వయంగా లేఖ రాయడంతో.. సీబీఐ ఎంక్వైరీ మేలని తమిళనాడు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాతిమా సూసైడ్ నోట్ లో కొన్ని పేర్లు ఉన్న తరుణంలో... సీబీఐ ఎవరెవరిని అదుపులోకి తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్రాస్‌ ఐ.ఐ.టి విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసును సి.బి.ఐకి అప్పగించింది తమిళనాడు ప్రభుత్వం. ఫాతిమా కేరళ వాసి. నవంబర్‌లో హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని చనిపోయింది. మద్రాస్‌ ఐఐటిలో ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్న ఫాతిమా.. తనను ఫ్రొఫెసర్‌ సుదర్శన్‌ పద్మనాభన్‌ వేధిస్తున్నారని ఆరోపించింది. అదే విషయాన్ని తండ్రికి రాసిన లేఖలోనూ ప్రస్తావించింది. ఆ తర్వాత ఫాతిమా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.  అయితే  ఈ అంశాలను ఎఫ్.ఐ.ఆర్ లో ప్రస్తావించలేదు పోలీసులు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు రేగడంతో దర్యాప్తును సి.బి.ఐకి అప్పగించింది తమిళనాడు ప్రభుత్వం. 

 

ఫాతిమా లతీఫ్‌.. పాయల్‌ తాడ్వి.. రోహిత్‌ వేముల.. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సముదాయాల నుంచి వచ్చిన వీరంతా ఎంతో కష్టపడి దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. కానీ తమ గోల్‌ సాధించకుండానే తనువు చాలించారు. వీరిందరి మధ్యా కామన్‌ పాయింట్‌ ఒక్కటే.. ప్రొఫెసర్ల వేధింపులు.  పాతిమా విషాదం గురించి తెలియగానే  విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.  జస్టిస్‌ ఫర్‌ ఫాతిమా పేరుతో వర్సిటీ అధికారులు.. పోలీసులపై ఒత్తిడి పెంచారు.

 

ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్‌లో సూసైడ్‌ నోట్‌ను  పంపిందని తెలిపారు ఫాతిమా తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌. ఆ లేఖలో ఉమా, చక్కు, వప్పిచ, తుంపు అనే పేర్లు ఉన్నాయని.. వారిపై కూడా  కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పళనిస్వామి.. .డీజీపీ త్రిపాఠీలను కోరారు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్న ఫాతిమా.. ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని తెలిపారు. ఒక్క సుదర్శన్‌ పద్మనాభనే కాకుండా.. మరికొందరు ప్రొఫెసర్లు హేమచంద్రన్‌ కరాహ్‌, మిస్టర్‌ మిలింద్‌ బ్రాహ్మే కూడా కారణమని ఫాతిమా కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక్క ఫాతిమానే కాదు. మద్రాస్‌ ఐ.ఐ.టిలో ఏడాది వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: