ట్రంప్ నోటికి తాళం వేసిన చిన్నారి..!

NAGARJUNA NAKKA

డొనాల్డ్ ట్రంప్ నోరు ఊరికే ఉండదన్న విషయం మరోసారి రుజువైంది. ఎప్పుడూ ఎవరో ఒకరిని కామెంట్ చేయనిదే ఆయనకు నిద్ర పట్టదు. ఆటలాడుకునే చిన్న పిల్లవాడినైనా గిల్లి ఏడిపించే రకం ట్రంప్. ఇప్పుడు ట్రంప్ లిస్ట్‌లోకి టీనేజర్‌ గ్రెటా థన్‌బర్గ్‌ చేరింది. టైమ్స్ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన గ్రెటాపై సెటైర్లు వేశారు ట్రంప్‌. ఆమె కూడా ట్రంప్‌కు తనదైన స్టైల్‌లోనే సమాధానమిచ్చింది.


ప్రముఖ టైమ్స్ మ్యాగజైన్... పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019గా స్వీడన్ కు చెందిన గ్రేటా థన్‌బర్గ్‌ను ప్రకటించింది.  16 ఏళ్ల గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ కోసం ఏడాది కాలంగా పోరాటం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ప్రకృతితో మానవాళికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూనే.. పర్యావరణం పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గ్లోబల్ వార్మింగ్ సహా వాతావరణ మార్పులపై ఆయా దేశాలు నూతన విధివిధానాలను రూపొందించాలని నినదిస్తోంది గ్రెటా. గత ఏడాది స్వీడిష్ పార్లమెంట్ ఎదుట ఒంటరిగా నిరసన వ్యక్తం చేయడంతో అప్పట్లో వార్తల్లోకెక్కింది. ఆ అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ప్రపంచ దేశాధినేతలను కడిగిపారేసింది ఈ చిచ్చర పిడుగు.

 

చిన్న వయసులో గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తోందని.. అందుకే ఆమెను పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తిస్తున్నట్లు టైమ్స్ ప్రకటించింది. అయితే ఈ వార్త కస్తా ట్రంప్ చెవిన పడింది. ఇక వెంటనే ఓ ట్వీట్ చేసేశారు.గ్రెటా తన యాంగర్ మేనేజ్‌మెంట్ సమస్యపై తప్పక పనిచేయాలి. ఆపై ఫ్రెండ్ తో కలిసి పాత ఫ్యాషనైడ్ మూవీకి వెళ్ళాలి.. చిల్ గ్రెటా, చిల్ అంటూ వెటాకారంగా ట్రంప్ ట్వీట్ చేశారు.

 

ట్రంప్ ట్వీట్‌కి తనదైన స్టైల్‌లోనే సమాధానమిచ్చింది గ్రెటా. యాంగర్‌ మేనేజ్‌మెంట్ సమస్యతో పోరాడుతున్న 16 ఏళ్ల టీనేజర్‌ ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ మూవీని చూస్తోందంటూ కొంటెగా ట్రంప్‌కి చురకంటించింది. దీంతో ట్రంప్‌కి చిన్నారి సరైన సమాధానమిచ్చిదంటూ నెటిజన్లు గ్రెటాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: