తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ సమ్మె, ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఆర్టీసీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తున్నారని ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు, యూనియన్లు పన్నాగం పన్నాయని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ అఫిడవిట్ పై కౌంటర్ దాఖలు చేశాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. రాజకీయాలతో ముడిపెట్టి ఎండీ అఫిడవిట్ దాఖలు చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె 45వ రోజు కొనసాగుతుండటంతో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.
ఆర్టీసీ ఎండీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ పై కాంగ్రెస్ మండిపడింది. తెలంగాణలో సంక్షోభం వచ్చేలా ఉందని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. అన్ని పార్టీలతో కలిసి సీఎం మీటింగ్ పెట్టాలని, ఆర్టీసీపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. సీఎం కేసీఆర్ వైఖరి కారణంగా 50వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖిరిన ఢిల్లీ వేదికగా బహిర్గతం చేస్తామన్నారు ఎంపీ సంజయ్.
మరోవైపు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డిని పరామర్శించారు ప్రొఫెసర్ కోదండరామ్. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిల అరెస్ట్‌ల విషయంలో పోలీసులు అనుసరించిన తీరు సరిగా లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న చిన్న ఉద్యమాలకే ప్రభుత్వాలు కూలిపోతాయని పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందన్నారు కోదండరామ్.
ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వం ఏమాత్రం బెట్టువీడకుండా ఉండటంతో.. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. మరోవైపు అనుకున్న విధంగా ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణీకులు.. హైకోర్టు విచారణపై ఆశగా ఎదురు చూస్తున్నారు.