ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీషు మీడియంపై ఆరోపణలు చేసే వాళ్లు హిప్రోకసీని వదిలి డెమోక్రసీకి విలువ ఇవ్వాలన్నారు సీఎం జగన్ .ఒంగోలులో మనబడి నాడు-నేడు కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. స్పార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ లు రాజ్యమేలుతున్న కాలంలో.. ఇంగ్లీష్ రాకపోతే మన పిల్లల పరిస్థితేంటని నిలదీశారు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆరాటపడుతుంటే, తనని టార్గెట్ చేసి అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించిన ఆయన, పేద పిల్లలు ఇంగ్లీష్ రాక .. ప్రపంచంతో పోటీపడలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈ విషయంలో తాను చేస్తున్న ప్రయత్నాన్ని తప్పు అన్నట్లుగా కొందరు పెద్దలు మాట్లాడుతున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి.
ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంలోకి మారినా.. తెలుగు తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌గా ఉంటుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఇంగ్లీష్ మీడియం ప్రారంభమవుతుందని.. ఆపై దశల వారీగా ఇతర తరగతులకు దీనిని అమలు చేస్తామని చెప్పారు సీఎం.
రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ చరిత్రను మార్చబోయే తొలి అడుగులు వేస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు ముఖ్యమంత్రి. పేదరికం నుంచి బాగుపడాలంటే చదువు ఒక్కటే మార్గం.. నిజమైన సంపదని జగన్ వ్యాఖ్యానించారు.తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించాలనీ, కాలేజీలకు పంపించాలని పిలుపునిచ్చారు. పిల్లలకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో పాటు రూ. 20వేలు తల్లి చేతికి ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని వివరించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలెప్‌మెంట్ కాలేజీలు తీసుకొస్తామని జగన్ హామీ ఇచ్చారు.