ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే...ఆర్టీసీ కార్మికుల ముందు కొత్త స‌మ‌స్య‌

Pradhyumna
``ఏపీలో ఆర్టీసీ విలీనం కాలేదు మ‌న్ను కాలేదు...అక్క‌డ అధ్య‌య‌నం మాత్ర‌మే జ‌రుగుతోంది. అస‌లు విలీనం జ‌రిగే ప‌ని కాదు``తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌..ఆర్టీసీ విలీనం గురించి ఏపీని ఉద‌హ‌రిస్తూ...చేసిన వ్యాఖ్య‌లు. `ఆర్టీసీ విలీనానికి అధ్య‌య‌నం చేయండి`` కేసీఆర్ కామెంట్ల అనంత‌రం ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఆదేశాలివి. ఈ ప‌ర‌స్ప‌ర విభిన్న‌మైన అంశాల ప‌రంప‌ర కొన‌సాగుతుండ‌గానే...ఆర్‌టీసీ కార్మికుల ముందు కొత్త స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. అదే...ఆర్టీసీ విలీనం వల్ల ప్రయోజనాల‌తో పాటు కొన్ని హక్కులు కూడా కోల్పోయే అవకాశాలున్నట్లు కార్మిక చ‌ట్టాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న‌ నాయకులు పేర్కొంటుండ‌టం కొత్త అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చింది. 


ప్రభుత్వంలో ఆర్‌టిసిని విలీనం చేయాలన్నది కార్మికుల చిరకాల డిమాండ్‌. సుమారు ఐదు దశాబ్ధాలుగా వారీ డిమాండ్‌ వినిపిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కార్మికుల మొర ఆలకించలేదు. ఈ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌...ఇచ్చిన హామీని నిలుపుకుంటుండ‌టంతో...ఇన్నాళ్ళకు ఈ డిమాండ్‌ నెరవేరబోతోంది. విలీనంతో... కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తుంది. ఆదాయంతో సంబంధంలేకుండా జీతాల పెంపు ఉంటుంది. ప్రభుత్వోద్యోగులకు పెరిగే ఫిట్‌మెంట్‌, డిఎ చార్జీలకనుగుణంగా వీరి వేతనాలు కూడా పెరుగుతాయి. సంస్థకొచ్చే నష్టాల్ని ప్రభుత్వమే భరిస్తుంది. కొత్త బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇవన్నీ కార్మికులకు కలిగే ప్రయోజనాలు. 


అయితే, అస‌లు చిక్కు ఇక్క‌డే వ‌చ్చి ప‌డింది. భారత్‌లో ఉద్యోగుల చట్టాలకంటే కార్మిక చట్టాలు చాలా పకడ్బందీగా ఉన్నాయి. వాటి అమలు కూడా కఠినంగా ఉంటోంది. ఆర్‌టిసి ప్రభుత్వంలో విలీనమైతే ఆర్‌టిసి కార్మికులు ప్రభుత్వోద్యోగులుగా మారతారు. దీంతో వీరికి కార్మిక చట్టాలు వర్తించవు. ప్రస్తుతం ఆర్‌టిసిలో కార్మికులకు ఓవర్‌టైమ్‌, లాభాలకనుగుణంగా బోనస్‌, ఇఎస్‌ఐలు లభిస్తున్నాయి. అలాగే మోటార్‌ వాహన చట్ట ప్రకారం కొన్ని ప్రయోజనాలు కూడా వీరికి సంస్థలు కల్పిస్తున్నాయి. ఉద్యోగులైతే ఇవేవీ లభించవు. ఇతర ఉద్యోగుల్తో సమానంగా జీతాలు మాత్రం పెరుగుతాయి. ఈ నేప‌థ్యంలో...విలీనంతో..అన్నీ ప్ర‌యోజ‌నాలే అనుకోవ‌డానికి అవ‌కాశం లేద‌ని...ప‌లువురు విశ్లేషిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: