హుజూర్‌న‌గ‌ర్ పొలిటిక‌ల్ చ‌రిత్ర ఏంటి.. ఏ పార్టీ స‌త్తా ఎంత‌..!

VUYYURU SUBHASH
హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర‌వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ ఉప ఎన్నికలో చా వోరేవో తేల్చుకునేందుకు ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు త‌మ‌దంటే.. త‌మ‌దంటూ ఢంకా బ‌జాయిస్తున్నాయి. ఇంత‌కీ ఓట‌ర్ల మ‌దిలో ఏముంది.. ఈసారి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టకడతారు..? హుజూర్‌నగర్‌ ఎవరికి ద‌క్క‌నుంది.. ఫ‌లితాలు ఎవ‌రికి మోదం, ఎవ‌రికి ఖేదం కానున్నాయి. తెలియాలంటే మాత్రం వచ్చే నెల 24 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


హుజూర్‌నగర్‌ నియోజకవర్గం 1952లో ఏర్ప‌డ‌గా, 1972 ఎన్నికల తర్వాత  ఈ నియోజకవర్గం రద్దయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పీడీఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తూ వస్తోంది. అయితే వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే.


1952లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయానికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో కమ్యూనిస్టులు ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (పీడీఎఫ్‌)గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అప్పట్లో పీడీఎఫ్‌ విజయ దుందుభి మోగించింది. ద్విసభ నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌ నుంచి ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు జయసూర్య, టీ నర్సింహులు విజయం సాధించారు.


అయితే  జయసూర్య మెదక్‌ నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఏర్పడిన ఖాళీతో ఉప ఎన్నిక జరిగింది. ఈ  ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నేత, కవి ముక్ధుం మొయినుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి. ఎస్‌.రెడ్డిపై విజ‌యం సాధించారు. 2009 పునర్విభజనతో ఏడు మండ‌లాల‌తో ఈ నియోజకవర్గం కొత్త‌గా ఏర్పాటైంది. ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో హస్తందే ఆధిపత్యం కొనసాగింది. 2009, 2014, 2018 ఎన్నిక‌ల్లో పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజ‌యంసాధించారు. అయితే 2018 ఎన్నిల్లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి సైదిరెడ్డి, ఉత్త‌మ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.


ఈఎన్నిక‌ల్లో ఉత్త‌మ్ 7, 436 స్వ‌ల్ప ఓట్ల‌తో గ‌ట్టెక్కారు. ఇక ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తిరెడ్డి బ‌రిలో నిల‌వ‌గా, టీఆర్ ఎస్ నుంచి మ‌ళ్లీ సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్ద‌రు నేత‌లు నువ్వా..నేనా ..అనే రీతిలో ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. మొత్తానికి ఉప ఎన్నిక ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: