పళ్లు బిగించి.. హౌ డేర్ యూ.. అంటూ బాలిక ఉద్వేగం

NAGARJUNA NAKKA

మీకెంత ధైర్యం..! మా భవిష్యత్తును నాశనం చేస్తారా ? మా కలలను చిదిమేస్తారా ? మా తరం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు..! ప్రపంచ దేశాల అధినేతలను సూటిగా ఇలా ప్రశ్నించడానికి ఎంతో ధైర్యం కావాలి..! ఓ పదహారేళ్ల అమ్మాయి ఆ పనిచేసింది..! పర్యావరణం సర్వనాశనమవుతున్నా కాలక్షేపం చేస్తున్న ప్రపంచాన్ని కడిగిపడేసింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నామన్న ఆవేదన... ఆమె ప్రతిమాటలోనూ కనిపించింది. 


పర్యావరణ పరిరక్షణపై జరుగుతున్న సదస్సుకు హాజరైన ఓ యువతి హౌ డేర్ యూ అంటూ ప్రపంచ దేశాలను ప్రశ్నిస్తుందని ఎవరైనా ఊహించగలరా? కానీ ఆ పని పదహారేళ్ల యువతి చేసింది. పర్యావరణాన్ని ప్రేమించే ఈ అమ్మాయి గుండెల నిండా ఆవేదనను నింపుకుని... ప్రపంచదేశాల లోపభూయిష్ట విధానాలను ప్రశ్నించింది. 


ఈ అమ్మాయి పేరు గ్రెటా థన్‌బర్గ్‌ . స్వీడన్‌కు చెందిన 16 ఏళ్ల గ్రెటా.. కొంతకాలంగా పర్యావరణ పరిరక్షణ కోసం పోరాటం చేస్తోంది. పర్యావరణం కోసం అది చేశాం..ఇది చేస్తున్నామంటూ కబుర్లు చెబుతున్న ప్రపంచదేశాల వైఖరితో విసిగిపోయింది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో తన గళం వినిపించేందుకు ఎంతో కష్టపడి న్యూయార్క్ చేరుకుంది. క్లైమెట్ చేంజ్‌ పై దేశాలు అవలంభిస్తున్న ద్వంద్వ విధానాలను ఎండగట్టింది.  


మీరు మా కలల్ని చిదిమేస్తున్నారు. మా బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఇదంతా తప్పు. మీకెంత ధైర్యం అంటూ ఉద్వేగంగా మాట్లాడింది గ్రెటా. భారీ వినాశనానికి దగ్గరలో ఉన్నా... ప్రపంచదేశాలు పట్టించుకోవడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఐక్యరాజ్యసమితి వేదికగా గ్రెటా చేసిన ఉద్వేగ ప్రసంగం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇప్పటికైనా ప్రపంచ దేశాలు పర్యావరణ పరిరక్షణపై నిజాయితీగా వ్యవహరించి తక్షణ చర్యలు తీసుకోకపోతే మా తరం మిమ్మల్ని క్షమించదంటూ హెచ్చరించింది. 


వయసు చిన్నదే అయినా....పర్యావరణ అంశాలపై గ్రెటాకు మంచి పట్టుంది. ఏఏ దేశాలను ఎలాంటి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నాయో ఆమెకు తెలుసు.  సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న సమయంలో ట్రంప్‌ను చూడగానే గ్రెటా పళ్లు బిగించింది. కోపంతో తదేకంగా చూసింది. పర్యావరణ పరిరక్షణపై ఎంతో ఆవేదనగా చేసిన ఈమె ప్రసంగంపై ట్రంప్ వెటకారంగా స్పందించారు. ఓ అద్భుతమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న సంతోషమైన యువతిలా ఆమె కనిపిస్తోంది. ఆమెను చూడటం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు... దీనిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: