ట్రాఫిక్ రూల్స్ క‌ష్టం: బ‌ండి రూ.15 వేలు... ఫైన్ రూ. 23 వేలు

VUYYURU SUBHASH
వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించే విషయంలో ఇప్పటివరకు ఒక లెక్క... ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్లుగా మారిపోయింది. ఇప్పటి వరకు ఎవరైనా ట్రాఫిక్ రూల్స్ పాటించ‌క‌పోయినా.. వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా... డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఎంతోకొంత జరిమానా విధించి వదిలేస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినా... వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా భారీ జరిమానాలు విధిస్తుండ‌డంతో వాహనదారులు గ‌గ్గోలు పెడుతున్నారు.


దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం వాహనదారుడు రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు పడతున్నాయి. అయితే ఈ నిబంధ‌న‌లు  తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, గుజరాత్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అమ‌లు కానున్నాయి. ఈ చ‌ట్టం ప్ర‌కారం వాహ‌న‌దారుడు హెల్మెట్, లైసెన్స్, రిజిస్ట్రేషన్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇలా ఎలాంటి డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా భారీ జ‌రిమానాలు త‌ప్ప‌వు.


ట్విస్ట్ ఏంటంటే ఈ కొత్త జ‌రిమానాలు వాహ‌నాల రేట్ల‌ను మించి ఉంటున్నాయి. ఢిల్లీలోని గురుగ్రామ్ కు చెందిన దినేష్ మదన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు అత‌డికి ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ.23 వేల ఫైన్ వేశారు. ఇంత‌కు అత‌డు చేసిన త‌ప్పేంటంటే బైక్‌పై వెళుతూ హెల్మెట్ పెట్టుకోలేదు. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్లు లేక‌పోవ‌డంతో పోలీసులు రూ.23 వేలు ఫైన్ వేశారు. ఇంత‌కు మద‌న్ ఆ బండిని సెకండ్ హ్యాండ్స్‌లో కేవ‌లం రూ.15 వేల‌కు కొన్నాడ‌ట‌. అంటే బండి ఖ‌రీదు రూ.15 వేలు అయితే.. ఫైన్ రూ.23 వేలు అయ్యింది.  


ఇలాంటి వాళ్లు ఎంతో మంది తాజా చ‌ట్టంతో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సారి ట్రాఫిక్ రూల్స్ క‌రెక్టుగా పాటిస్తామ‌ని చెప్పినా కూడా పోలీసులు విన‌డం లేద‌ట‌. మొత్తానికి కొత్త ట్రాఫిక్ రూల్స్ తో వాహనదారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ చ‌ట్టంతో ఎంత‌మందిలో మార్పు వ‌స్తుంది ?  దేశంలో వాహ‌న ప్ర‌యాదాలు త‌గ్గుతాయా ? అన్న‌ది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: