తూర్పులో చంద్రబాబుకు షాక్
తూర్పుగోదావరి జిల్లాలో
సీనియర్ నేత చంద్రబాబునాయుడుకు వరుపుల
రాజా షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి
రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్తిపాడులో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన
రాజా చంద్రబాబు మీద అసంతృప్తితోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.
మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి చాలామంది నేతలు టిడిపికి రాజీనామా
చేస్తున్నారు.
పార్టీకి రాజీనామా చేసిన నేతల్లో ఎక్కువమంది కాపు సామాజికవర్గం నేతలే ఉండటం గమనార్హం. తన రాజీనామా సందర్భంగా రాజా మాట్లాడుతూ టిడిపి ముణిగిపోతున్న పదవ లాంటిదన్నారు. పార్టీకి ఏపిలో భవిష్యత్తులో మనుగడ కష్టమని అభిప్రాయపడ్డారు. పార్టీకి రాజీనామా చేస్తున్న నేతలంతా చంద్రబాబు మీద బండలేసి బయటకు వెళిపోతుండటం మామూలే అయిపోయింది.
కాపు సామాజికవర్గం నేతలకు పార్టీలో గుర్తింపు ఉండటం లేదన్నారు. మొదటి నుండి కూడా చంద్రబాబు కాపులను చిన్న చూపు చూస్తున్నట్లు మండిపోయారు. రాష్ట్రంలోని పేదలకు ఏమి కావాలో తేల్చుకోలేని చంద్రబాబు సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశారో అందరూ ఆలోచించాలని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కితాబిచ్చారు. జగన్ పాలనను బ్రహ్మిండమని పొగడటం ద్వారా రాజకీయంగా తన భవిష్యత్ అడుగులు ఏ పార్టీ వైపు వేయబోతున్నారో చెప్పకనే చెప్పేశారు. కాకపోతే తన మద్దతుదారులతో సమావేశమై వారు చెప్పినట్లే నడుచుకుంటాననే పడికట్టు పదాలు పలికారులేండి.
మొత్తానికి సంవత్సరాలుగా పార్టీలో ఉన్న రాజా టిడిపిని వదిలేయటం నిజంగా ప్రత్తిపాడులో దెబ్బనే చెప్పాలి. తూర్పుగోదావరి జిల్లాలో అసలే కాపుల ప్రాబల్యం ఎక్కువ. దానికి తోడు రాజా లాంటి కాపు నేతలు పార్టీకి రాజీనామా చేయటం కచ్చితంగా టిడిపిపై ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు. రాజా గనుక వైసిపిలో చేరితే ఆయనతో పాటు మరింత మంది కాపు నేతలు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.