జగన్ ను వెంటాడుతున్న చంద్రబాబు రాజకీయం
కొన్నిసార్లు అంతే ఎంత
దూరంగా ఉంచుదామని అనుకున్నా ముందు వాళ్ళు చేసిన కంపు వెంటాడుతునే ఉంటుంది. ఇపుడు
జగన్మోహన్ రెడ్డి పరిస్ధితి అలాగే తయారైంది. అధికారంలో ఉన్న ఐదేళ్ళల్లో పాలనలో
కానీ రాజకీయంగా కానీ చంద్రబాబునాయుడు చేసిన కంపు ఇపుడు జగన్ ను వదలకుండా
వెంటాడుతోంది.
2014లో అధికారంలోకి రావటానికి అప్పట్లో చంద్రబాబు కాపులను బిసిల్లో చేరుస్తామనే హామీనిచ్చారు. అలాగే రైతు రుణమాఫీ చేస్తానన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని, అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని...ఇలా చాలా హామీలను నోటికొచ్చినట్లు చెప్పేశారు.
మొత్తానికి అధికారంలోకి వచ్చారు. ఇంకేముంది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా వ్యవహరించారు. పై హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అమలు విషయాన్ని పక్కనపెడితే మొత్తం వ్యవహారాలను కంపు చేసేశారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు లేండి.
అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఇపుడు జగన్ ను తగులుకుని వెంటాడుతున్నాయి. రుణమాఫీ చేయాల్సిందేనంటూ చంద్రబాబు అండ్ కో ఇపుడు జగన్ ను ప్రతీరోజు షంటుతున్నారు. భృతిని ఆపేసి లక్షాలదిమంది నిరుద్యోగులను ఇబ్బందులు పెడుతున్నట్లు మండిపోతున్నారు. కాపులకు తాము వర్తింపచేసిన 5 శాతం ఇబిసి రిజర్వేషన్ వర్తింపచేయాల్సిందేనంటూ ఆందోళన చేస్తున్నారు. సరే పోలవరం గోల అందరూ చూస్తున్నదే.
ఇలా ఏరకంగా చూసినా చంద్రబాబు ఐదేళ్ళ కంపు జగన్ ను వెంటాడుతోంది. పాలనలో తనదైన ముద్ర చూపించాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారు. అందుకనే అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తానిచ్చిన హామీల అమలకు పరుగులు తీస్తున్నారు. అయితే వాటిపై సరైన దృష్టిపెట్టలేకపోతున్నది కూడా వాస్తవమే. కారణం ఏమిటంటే జగన్ వేసే ప్రతీ అడుగులోను చంద్రబాబు రాజకీయం అడ్డుపడుతోంది. చంద్రబాబు చేసిన కంపును కడగటానికి జగన్ కు ఎంత కాలం పడుతుందో చూడాల్సిందే ?