నేను వై.ఎస్.జగన్ పీఏని.. రూ. లక్షలు కొట్టండి ఏ పనైనా చేసిపెడ్తా..!?

Chakravarthi Kalyan

అధికారంలో ఉన్నవారి పేరుని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడే వారికి కొదవ ఉండదు. అయితే ఇలాంటి వారు తరచూ మంత్రుల పీఏల మనో..అధికారుల పీఏల మనో చెప్పుకుంటుంటారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని.. సీఎంఓలో ఫైళ్లు కదిలిస్తామని.. ప్రలోభపెట్టి లక్షలు వసూలు చేసుకుంటుంటారు.


అయితే ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పీఏని అంటూ కూడా కొందరు మోసాలకు తెగబడుతున్నారు. మొన్నటికి మొన్న.. విశాఖలో ఓ మాజీ క్రికెటర్... జగన్ పీఏగా పరిచయం చేసుకుంటూ.. ఓ మొబైల్ కంపెనీకి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. కంపెనీ ప్రతినిధులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే.. అలా ఆ మోసగాడి గుట్టు బయటపడింది. జల్సాల కోసం ఈ క్రికెటర్ చేసిన.. మోసాల చిట్టా గురించి తెలుసుకొని పోలీసులు ఆశ్చర్యపోయారు.


ఇప్పుడు అలాంటిదే మరో మోసాల ఉదంతం కూడా విశాఖ పట్నంలోనే వెలుగు చూసింది. వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటి పీఏ పేరును వీరు ఉపోయగించుకున్నారు. వీరు ఏకంగా ఎమ్మెల్యేల టిక్కెట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు తెగబడ్డారట. విశాఖకు చెందిన తరుణ్, జగదీశ్, జయకృష్ణ, విష్ణుమూర్తి అనే నలుగురు కుర్రాళ్లను హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.


వైసీపీ సంయుక్త కార్యదర్శి హర్షవర్థన్ రెడ్డి వీరిపై ఫిర్యాదు చేశారు. ఆ కంప్లయింట్ మేరకు గత డిసెంబర్ లో కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుల కోసం వేట మొదలైంది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. అందుకే అధికార పార్టీకి చెందిన సీఎం, మంత్రులు, అధికారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.


జనం కూడా ఫలానా నాయకుడు మాకు తెలుసు అనగానే.. తమ పనులు చేసిపెట్టమని పురమాయిస్తుంటారు. ముందూ వెనుకా చూసుకోకుండా లక్షలకు లక్షలు ముట్టజెపుతుంటారు. అలా అక్రమ మార్గాల్లో పనులు జరగడం అంత సులభం కాదని.. వాటిలో నూటికి 90 శాతం ఫేక్ ఉంటాయని తెలుసుకుంటే మంచిది. లేకపోతే.. అటు డబ్బూ పోతుంది..ఇటు కేసుల్లోనూ చిక్కుకోవాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: