ఆ తెలుగు న్యూస్ ఛానెల్ సేల్ పెట్టేశారా... కొనేవాళ్లే లేరా...!

VUYYURU SUBHASH
అవును! ఈ వార్త ఇప్పుడు మీడియా రంగంలోనే కాకుండా రాజ‌కీయంగా కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఎన్నో ఆశ‌లు, ల‌క్ష్యాల‌తో ప్రారంభించిన 99% టీవీ ఛానెల్‌ను అమ్మ‌కానికి సిద్ధం చేశార‌నే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తిగా మారింది. దీంతో ఈ ఛానెల్ పుట్టు పూర్వోత్త‌రాల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చ న‌డుస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల త‌ర‌ఫున నిత్యం పోరాటాలు చేసే క‌మ్యూనిస్టుల‌కు మీడియాలో పెద్ద‌గా ఫాలోయింగ్ ఉండ‌దు. అవ‌స‌ర‌మైతే.. చూపించ‌డం లేకుండా ఎవాయిడ్ చేయ‌డం అనేది అన్ని మీడియా సంస్థ‌లు చేస్తున్న ప‌నే. దీంతో క‌మ్యూనిస్టులు చేస్తున్న ఉద్య‌మాలు కానీ, రాజ‌కీయాలు కానీ.. ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా చేరువ కాలేద‌నే చెప్పాలి.


ఈ క్ర‌మంలోనే రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందుగానే సీపీఐ, సీపీఎంలు త‌మ గ‌ళం కూడా ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెళ్లాంటే మీడియా మ‌ద్ద‌తు త‌ప్ప‌ద‌ని గ్ర‌హించాయి. కొన్ని ద‌శాబ్దాలుగా రెండు క‌మ్యూనిస్టు పార్టీలూ.. వేర్వేరుగా ప‌త్రిక‌లు న‌డుపుతున్నా.. బ‌ల‌మైన ఎల‌క్ట్రానిక్ మీడియా ఉంటేనే త‌ప్ప త‌మ ఉద్య‌మాల‌కు ప్ర‌జ‌ల్లోను, పార్టీల్లోనూ.. ముఖ్యంగా ప్ర‌భుత్వాల‌ను క‌దిలించ‌డంలోనూ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించాయి. ఈ నేప‌థ్యంలో సీపీఎం ``10 టీవీ`` ఏర్పాటు చేసుకుంది. ఇక‌, సీపీఐ వినూత్నంగా స‌మాజంలో అట్ట‌డుగు వ‌ర్గాలు 99% మంది ఉంటే.. మిగిలిన 1% మాత్రం ఈ మొత్తం 99% మంది క‌ష్టాన్ని దోచుకుంటోంద‌ని భావిస్తూ.. ఇదే పేరుతో `99%` ఛానెల్‌ను ప్రారంభించింది. 


అంటే.. తాము స‌మాజంలోని అట్ట‌డుగు వ‌ర్గాలుగా ఉన్న 99% మందికి ప్రాతినిధ్యం వ‌హించేందుకే ఉన్నామ‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించింది. అయితే, ఎంత‌లేద‌న్నా.. ఛానెల్ అన్నాక ఛానెలే.. దానికి రేటింగులు, ప్ర‌క‌ట‌న‌లు అవ‌స‌రం. ఇవే లేన‌ప్ప‌డు, ఆర్థికంగా స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్పుడు ఆకాంక్ష‌లు నెర‌వేరే ప‌రిస్థితి ఉండ‌దు. దీంతో తాము ఏ మంచి ఉద్దేశంతో పెట్టినా.. ఆర్థికంగా న‌ష్టాలు ఎదుర్కొనే స్థితికి చేరుకోవ‌డంతో ఛానెల్‌ను వ‌దిలించుకునేందుకు సీపీఐ ప్ర‌య‌త్నించింది. అయితే, అదేస‌మ‌యంలో క‌మ్యూనిస్టులు ఏపీలోను, తెలంగాణ‌లోనూ రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శించిన జ‌న‌సేన‌తో పొత్తులు పెట్టుకున్నారు. 


జ‌న‌సేనాని ప‌వ‌న్ ఏపీలో టీడీపీతో అంట‌కాగిన‌న్నాళ్లు.. అన్ని మీడియా సంస్థ‌లు, ముఖ్యంగా ఎల్లో మీడియాలో ప్ర‌చారం తార‌స్థాయికి చేరుకుంది. ఆయ‌న ఏం మాట్లాడినా లైవ్‌లు ఇచ్చారు. బాబుతో విభేదించాక త‌గ్గించేశారు. దీంతో త‌న‌కు ప్ర‌చారం ద‌క్క‌డం లేద‌ని భావించిన ప‌వ‌న్ త‌న‌కు కూడా సొంత‌గా ఛానెల్ ఉంటే బాగుంటుంద‌ని భావించారు. ఈ క్ర‌మంలోనే 99% వాళ్లు ఆయ‌న‌ను అప్రోచ్ కావ‌డం, ఇక‌, పార్టీలో బ‌ల‌మైన ఆర్థిక నాయ‌కుడిగా ఉన్న తోట చంద్ర‌శేఖ‌ర్ కూడా ఈ ఛానెల్‌లో మెజారిటీ వాటాలు కొనేందుకు రావ‌డంతో మొత్తంగా ఈ ఛానెల్‌ను క‌మ్యూనిస్టుల చేతి నుంచి జ‌న‌సేన కైవ‌సం చేసుకుంది. 


ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన‌కు విస్తృతంగా ప్ర‌చారం క‌ల్పించారు. అయితే, ఒక్క‌సారి ఛానెల్‌పై ప‌డ్డ ముద్ర పోవాలంటే .. అంత ఈజీకాదు. ఇదే 99% ఛానెల్ విష‌యంలోనూ జ‌రిగింది. దీంతో ఆ ఛాన‌ల్ త‌ర్వాత కాలంలోనూ పుంజుకోలేదు. ఇక‌, ఎన్నిక‌ల్లో అంతో ఇంతో ప్ర‌భావం చూపితే.. ఆ ర‌కంగానైనా నెట్టుకు వ‌ద్దామ‌నుకున్నా.. జ‌న‌సేన చ‌తికిల ప‌డింది. దీంతో ఇప్పుడు ఛానెల్ నిర్వ‌హ‌ణ భారాన్ని మోయ‌లేమంటూ.. తోట చంద్ర‌శేఖ‌ర్ చేతులు ఎత్తేశారు. ఈ నేప‌థ్యంలోనే కొనేవారుంటే రావ‌లెను! అంటూ ప్ర‌చారం ప్రారంభించారు. మ‌రి ఎవ‌రు కొంటారో.. ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: