ఏపీ సీఎం జగన్ కేబినెట్‌ను ఈ నెల 8న ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కేబినెట్ ఏర్పాటుకు ఒక్క రోజు ముందు 7వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేల శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. ఈ క్రమంలోనే జగన్ తన కేబినెట్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉండేలా కూర్పు చేస్తున్నారు. రెడ్డి, కాపు, బీసీ, వైశ్య, మైనార్టీ, కమ్మ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి ఒక్క వర్గానికి చెందిన వ్యక్తి కేబినెట్‌లో ఉండనున్నారు. వీలును బట్టి బ్రాహ్మణ వర్గానికి స్పీకర్ లేదా మంత్రి పదవి కూడా ఇస్తారంటున్నారు.
ఇక కోస్తాలో కీలకమైన కాపు సామాజికవర్గానికి జగన్ కేబినెట్ కాపు కాయబోతోందన్నది కన్‌ఫార్మ్ అయ్యింది. చంద్రబాబు తన కేబినెట్‌లో నలుగురికి చోటు కల్పించాడు. హోం కం డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పైడికొండల మాణిక్యాలరావు (బీజేపీ కోటా తర్వాత రిజైన్ చేశారు), గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణకు చోటు ఇచ్చారు. ఇక ఇప్పుడు జగన్ కూడా తన కేబినెట్లో నాలుగు లేదా ఐదుగురు కాపులకు చోటు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
జగన్ కేబినెట్‌లో ప్రధానంగా కాపు మంత్రులు ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు లేదా ముగ్గురుతో పాటు విశాఖ జిల్లా నుంచి ఒక మంత్రి ఉండనున్నారు. విశాఖ జిల్లా నుంచి చూస్తే ఈ కోటాలో అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ పేర్లు ప్రముఖంగా ఉన్నాయి. ఇక పార్టీ మారినప్పుడు అవంతికి మాట ఇచ్చారని అంటున్నారు. అలాగే అమర్నాథ్‌కు జగన్ మాట ఇచ్చారన్న ప్రచారం ఉంది. ఇక మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు పార్టీలో సీనియర్.. వరుసగా రెండోసారి గెలిచారు.
ఇక ఏపీలోని పెద్దది అయిన తూర్పు గోదావరి జిల్లాలో 2019 ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాలు గెలుచుకుంది. జిల్లాలోని మూడు పార్లమెంట్ స్థానాలను కూడా వైసీపీ గెలిచింది. ఈ జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలకు మూడు మంత్రి పదవులు ఖాయం అంటున్నారు. కాపు కోటాలో తుని నుంచి వరుసగా రెండోసారి గెలిచిన దాడిశెట్టి రాజాతో పాటు రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా (వైఎస్.విజయలక్ష్మి రికమెండేషన్ ఉందన్న ప్రచారం ఉంది).. ఇక రెండోసారి గెలిచిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేరు కూడా కాపు వర్గం నుంచి లైన్లో ఉన్నాయి. అయితే జగన్ మొగ్గు దాడిశెట్టికే ఉందంటున్నారు.
ఇక పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇద్దరు కాపు వర్గ నేతలు ప్రముఖంగా కేబినెట్ రేసులో ఉన్నారు. వీరిలో భీమవరంలో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ ఉన్నారు. ఈయన గతంలో కూడా కాంగ్రెస్ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఏలూరు నుంచి మూడోసారి గెలిచిన ఆళ్ల నాని పేరు కూడా వినిపిస్తోంది. ఈ జిల్లాలో జగన్ ఒక్క కాపు వర్గానికి చెందిన వారికే మంత్రి పదవి ఇవ్వనున్నారు. ఇక కీలకమైన కృష్ణా జిల్లా నుంచి కూడా మాజీ మంత్రి పేర్ని నానితో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా కాపు కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ జిల్లాలో కాపులకు ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటే వీరిద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి రావొచ్చు.