నందమూరి సుహాసిని ఓటమి ఖాయం.. ఇవిగో సిగ్నల్స్..

Chakravarthi Kalyan

తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజక వర్గాల్లో కూకట్ పల్లి ఒకటి. ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య ఇక్కడ చాలా ఎక్కువ. తెలుగుదేశం బలంగా ఉన్ననియోజకవర్గాల్లో ఇది ఒకటి. అందుకే గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి మాధవరం గెలుపొందారు. ఆయన ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సీటును ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న టీడీపీ అనూహ్యంగా నందమూరి సుహాసినిని రంగంలోకి దింపింది. హరికృష్ణపై ఉన్న సానుభూతి, సెటిలర్ల ఓట్లతో ఈ సీటు గెలవొచ్చని చంద్రబాబు భావించారు. అంతే కాదు.. ఏకంగా చంద్రబాబు, బాలకృష్ణ స్వయంగా ప్రచారం చేశారు. కానీ.. అది అంత సులభం కాదని ప్రాక్టికల్ గా తేలనుంది. ఇక్కడ సుహాసిని ఓటమి ఖాయమని గ్రౌండ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.



సుహాసిని ఓడిపోతుందని టీఆర్ఎస్ వర్గాలు చెప్పడం కాదు.. ప్రజాకూటమి నేతలే అంగీకరిస్తున్నారు. అంతే కాదు.. సుహాసిని ఓటమికి టీడీపీ నేతలే కారణమని ఆరోపిస్తున్నారు కూడా. సుహాసిని పేరు తెరపైకి రాకముందు ఈ సీటు నుంచి పెద్దిరెడ్డి పోటీ చేయాలని భావించారు. చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. ఆ తర్వాత అనూహ్యంగా సుహాసిని సీన్ లోకి వచ్చారు. దీంతో మనస్థాపం చెందిన పెద్దిరెడ్డి సుహాసిని విజయం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదట.



కనీసం పెద్దిరెడ్డి ప్రజాకూటమిలోని నేతలతో ఒక్క సమన్వయ సమావేశం కూడా జరపలేదని తెలంగాణ జన సమితి నేత ఏకంగా చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు.. పోల్ మేనేజ్ మెంట్ లో కూడా టీడీపీ ఇక్కడ బాగా వెనుకబడిందట. పోలీసు ఉన్నతాధికారులు కూడా టీఆర్ఎస్ కు సహకరించారని సుహాసిని ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. మొత్తానికి ఈ సంకేతాలన్నీ చూస్తే నందమూరి సుహాసిని ఓటమి ఖాయంగానే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: