భూమా అఖిల ప్రియ. కర్నూలు జిల్లా నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అఖిల ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణంతో చంద్రబాబు కేబినెట్‌లో పర్యాటక మంత్రిగా చేరిన ఆమె.. నంద్యాల సహా ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో చక్రంతి ప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఆమె దూకుడు వ్యవహారాలే ఆమెకు శత్రువుగా మారుతున్నాయి. కీలకనేతలకు ఆమెకు అస్సలు పడడం లేదు. ఇప్పటికే భూమాకు అత్యంత సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డితో వివాదం పెట్టుకున్న విషయం తెలిసిందే. నువ్వా-నేనా అనేరేంజ్‌లో సాగిన వివాదం.. సీఎం చంద్రబాబు తీర్పు.. దరిమిలా..ఏవీకి నామినేటెడ్ పదవి.. దీంతో ఇప్పుడు ఒకింత రాజకీయం చల్లారిందని అనుకుంటున్న తరుణంలో అఖిలకు తన సొంత వ్యవహారాలే మరోసారి బూమరాంగ్ మాదిరిగా తగులుతున్నాయి.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి, మంత్రి అఖిల ప్రియకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వాస్తవానికి.. అఖిలప్రియను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘కోడలా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మట్టి వివాదం రేగింది. . నంద్యాల పట్టణానికి సమీపాన మహానంది మండల పరిధిలో సాగుతున్న ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మంత్రి అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మధ్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. తన నియోజకవర్గంలో తాను మాత్రమే ఎర్రమట్టిని తవ్వుకుంటానని ఎమ్మెల్యే బుడ్డా వాదిస్తున్నారు. అయితే.. తాము పొలందారుడి నుంచి లీజుకు తీసుకున్నామని మంత్రి అనుచరులు అంటున్నారు. అటు ఎమ్మెల్యే అనుచరులు బుడ్డా స్టిక్కర్ ఉన్న వాహనాల్లో తిరుగుతూ ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు.
ఇటు మంత్రి అనుచరులు కూడా ఆమె స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాల్లో హల్‌చల్ చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. ఎర్రమట్టి వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అఖిలప్రియతో విభేదాలు ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని దగ్గరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బంధువుకు కూడా ఎర్రమట్టి తవ్వకాల్లో కొంచెం వాటా ఇచ్చారని సమాచారం. మొన్నటివరకు ‘కోడలా’ అని పిలిచిన బుడ్డానే ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా కూటమి కడుతుండడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. ఏవీ ఇప్పటికే అఖిల అంటే కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి ఉంది. ఇక, ఇప్పుడు బుడ్డా కూడా చేయి కలిపితే.. అఖిల ప్రియకు వ్యతిరేక ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ప్రభావం పడుతుందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.